
- హాజరుకానున్న తెలంగాణ, ఏపీ సీఎంలు
- గోదావరి– బనకచర్లపై కీలకంగా చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించేందుకు బుధవారం అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ సెక్రటరీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్ట్‌లు, బోర్డుల వర్కింగ్ మాన్యువల్, రెండు బేసిన్లలో నీటి వినియోగం, వృథా నీటి పేరుతో ఏపీ తెరలేపిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ లపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించనున్నారు.
కాగా.. గోదావరి– -బనకచర్లకు అనుమతివ్వాలని ఏపీ సర్కార్ పట్టుబడుతున్నది. సీఎం చంద్రబాబు వారానికి ఒకసారి ఢిల్లీ పర్యటన పెట్టుకొని మరీ ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రంలోని తమ మిత్రపక్షమైన బీజేపీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 19న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్ పర్ట్స్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) భేటీలో బనకచర్ల అంశంపై చర్చించారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఏపీ అక్రమంగా చేపట్టాలని యోచిస్తున్న గోదావరి-–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను తొలినుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రాజెక్ట్ తో ఎగువ రాష్ట్రమైన తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఇప్పటికే పలు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జూన్ 19, మార్చి 3న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఈ భేటి అనంతరం త్వరలో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.