ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఆపిల్ బాస్ టిమ్ కుక్. ఆయన త్వరలోనే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడైంది. 65 ఏళ్లు నిండిన కుక్ 2011లో స్వీవ్ జాబ్స్ నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగియనున్న తరుణంలో తర్వాత ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.
అయితే ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్ల కంపెనీకి ఆపిల్ హార్డ్ వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ కొత్త సీఈవో రేసులో ఉన్నట్లు తెరపైకి వచ్చింది. ఆపిల్ సంస్థకు టిమ్ కుక్ ఆపరేషన్ మాస్టర్ మైండ్ అయితే జాన్ టెర్నస్ హార్డ్ వేర్ ఆర్కిటెక్ట్ అని చెబుతుంటారు. టెర్నస్ 2001లో కంపెనీలోని డిజైన్ టీంలో భాగంగా మారాడు. అతను ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్స్, ఎయిర్ పాడ్స్ వంటి అన్ని ఉత్పత్తులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి తరం ఐప్యాడ్ అభివృద్ధికి మార్గనిర్దేశం చేశాడు జాన్ టెర్నస్. ఆపిల్‌లో చేరడానికి ముందు.. టెర్నస్ వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ 50 ఏళ్ల చరిత్రలో 6వ సీఈవోగా రేసులో కొనసాగుతున్నారు. కంపెనీ జనవరిలో తన ఆదాయాలు ప్రకటించిన తర్వాతే కొత్త సీఈవో ఎవరు అనే ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. టిమ్ తన పదవీ కాలంలో కంపెనీ విలువను 350 బిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు అనేక ప్రతికూలతలను ఎదురొడ్డి వృద్ధి చేశారు. కంపెనీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన దీనిపై చేయలేదు.
