హ్యాకర్లకు ఆఫర్..ఐఫోన్​ను హ్యాక్​ చేస్తే రూ.7 కోట్లు

హ్యాకర్లకు ఆఫర్..ఐఫోన్​ను హ్యాక్​ చేస్తే రూ.7 కోట్లు

యాపిల్​ ఐఫోన్​.. ఆండ్రాయిడ్​ ఫోన్ల కన్నా కొంచెం ధర ఎక్కువే. రేటే కాదు, దాంట్లోని ఫీచర్లూ ధరకు తగ్గట్టే ఉంటాయి మరి. ముఖ్యంగా సెక్యూరిటీ ఫీచర్​. దాంతోనే ఐఫోన్​కు క్రేజ్​ ఎక్కువ. ఇప్పుడు ఆ సెక్యూరిటీని దాటి వస్తారా అంటూ యాపిల్​ సవాల్​ విసురుతోంది. తమ సెక్యూరిటీ ఫీచర్​ను పడగొట్టి ఐఫోన్​ను హ్యాక్​ చేస్తే 10 లక్షల డాలర్లు (సుమారు ₹7.13 కోట్లు) ఇస్తామని హ్యాకర్లకు ఆఫర్​ చేస్తోంది. గురువారం అమెరికాలోని లాస్​వేగాస్​లో జరిగిన బ్లాక్​ హ్యాట్​ టెక్నాలజీ సెక్యూరిటీ సదస్సులో కంపెనీ ‘సెక్యూరిటీ’ చీఫ్​ ఇవాన్​ క్రిస్టిక్​ ఈ బంపర్​ ఆఫర్​ను ప్రకటించారు. నిజానికి 2016 నుంచే ఇలాంటి సవాళ్లను హ్యాకర్లకు ఇస్తోంది కంపెనీ. అయితే, ఆ హ్యాకింగ్​ను చెడు కోసం వాడకుండా, కంపెనీ కోసం పనిచేసేలా వారికి డబ్బు కానుకలిస్తోంది. 2016లో 2 లక్షల డాలర్లు (1.42 కోట్లు)గా ఉన్న ప్రైజ్​ మనీని ఇప్పుడు ఐదు రెట్లు పెంచేసింది.Apple offers

హ్యాకర్ల నుంచి సేఫ్​గా ఉంచేందుకే

ఈ సదస్సులో యాపిల్​ సీఈవో టిమ్​ కుక్​ కూడా పాల్గొన్నారు. ఈ మధ్య కొందరు హ్యాకర్లు సెక్యూరిటీని దాటుకుని మరీ చొరబడి డేటాను చోరీ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవసీ కూడా ‘మానవ హక్కు’ అని చెప్పారు. యూజర్ల డేటాను యాపిల్​ ఎప్పుడూ తీసుకోదని, హ్యాకర్ల నుంచి ప్రపంచంలోని 200 కోట్ల మంది యూజర్లను సేఫ్​గా ఉంచేందుకు కట్టుబడి ఉందని వివరించారు. ఈ పోటీని వారం క్రితమే మొదలుపెట్టలేదని, కొన్నేళ్లుగా యూజర్ల ప్రైవసీ, భద్రత కోసం పనిచేస్తున్నామని చెపారు. యాపిల్​ ఫోన్లలో బగ్స్​ను గుర్తించేందుకు వీలుగా ఈజీగా హ్యాక్​ అయ్యే కొన్ని ఐఫోన్లను వచ్చే ఏడాది ఇస్తామని క్రిస్టిక్​ చెప్పారు. హ్యాకింగ్​ ముప్పును తప్పించేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని, ఫోన్లలోకి చొరబడి డేటా చోరీ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకోవడాన్ని అడ్డుకోవడమే ఈ పోటీ ఉద్దేశమని అన్నారు. హ్యాకింగే కాకుండా ఇతర ప్లాట్​ఫాంలపైన రీసెర్చ్​ చేసే వారికీ మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

యాపిల్​ ఒక్కటే కాదు

ఇలాంటి పోటీలను యాపిల్​ ఒక్కటే కాదు, కొన్ని పెద్ద సంస్థలూ ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. అయితే, యాపిల్​తో పోలిస్తే చాలా చాలా తక్కువ ప్రైజ్​మనీని ఆఫర్​ చేస్తున్నాయి. జులైలో గూగుల్​ కూడా ఇలాంటి సవాలే విసిరింది. క్రోమ్​ను హ్యాక్​ చేసి లోపాలు చెబితే 30 వేల డాలర్లు (₹21.4 లక్షలు) ఇస్తామని ఆఫర్​ చేసింది. మరికొన్ని పెద్ద కంపెనీలూ ఇలాంటి పోటీలు పెడుతున్నాయి. గత నెలలో అమెరికా, కెనడాలో 10.6 కోట్ల మంది క్యాపిటల్​ వన్​ క్రెడిట్​ కార్డ్​ యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేశారు. ఇటీవలి కాలంలో ఓ పెద్ద కంపెనీకి ఎదురైన అతిపెద్ద హ్యాకింగ్​ ముప్పు ఇదే కావడం గమనార్హం. అందుకే కంపెనీలు ముందు జాగ్రత్తగా చర్యగా, లోపాలను సరి చేసుకోవడానికి ఈ పోటీలు పెడుతున్నాయి.