కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీస్కోవాలి: బండి సంజయ్​

కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీస్కోవాలి: బండి సంజయ్​

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలుకు నిధులెలా సమకూరుస్తారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్​జిల్లా పార్టీ ఆఫీసులో ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేద వాడి వరకు తీసుకెళ్లాలనే ఆశయాలను అమలు చేసిన నాయకుడు వాజ్ పేయి అని కొనియాడారు. 

ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డే స్కీమ్ లకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై సందేహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారు. వాళ్లందరికీ ఎలా న్యాయం చేస్తారు’’అని ప్రశ్నించారు. వెంటనే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. 

దీంతోపాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్​సర్కారు రూ.50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే.. 6.75 లక్షల కోట్ల అప్పు, భూముల అమ్మకం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుందని సంజయ్ ప్రశ్నించారు.