
హైదరాబాద్, వెలుగు: క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కి ముగ్గురు డైరెక్టర్లను సహకార శాఖ నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్, ఆర్టీసీ హెడ్ ఆఫీస్ నుంచి ఈ ముగ్గురు ప్రాతినిధ్యం వహించనున్నారు. బస్ భవన్ నుంచి యాదగిరి, కరీంనగర్ జోన్ నుంచి లక్ష్మయ్య, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి ఎల్లారెడ్డికి చోటు దక్కింది. సోమవారం సీసీఎస్ బోర్డు సమావేశం జరగనుంది. ముఖ్యంగా సీసీఎస్కు ఆర్టీసీ మేనేజ్ మెంట్ గత రెండేళ్లుగా రూ.1035 కోట్లు బకాయి ఉంది. ఆర్టీసీ అధికారులపై సీసీఎస్ సెక్రటరీ ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించడం లేదు. దీనిపై పలుమార్లు హైకోర్టు లో సీసీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు సైతం ఈ బకాయిల్లో రూ.200 కోట్లు చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. గడువు ముగిసినా ఆ బకాయిలను ఆర్టీసీ చెల్లించలేదు. దీనిపై వచ్చే వారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీసీఎస్ భేటీ కానుంది.