AR Rahman: ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్‌.. వివాదం ముదరడంతో క్లారిటీ ఇచ్చిన సంగీత దిగ్గజం

AR Rahman: ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్‌.. వివాదం ముదరడంతో క్లారిటీ ఇచ్చిన సంగీత దిగ్గజం

ఆస్కార్ విజేత, భారతీయ సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడంపై స్పందించిన రెహమాన్, “గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరిగింది. క్రియేటివిటీ లేని వాళ్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చు” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్లోని ‘మతపరమైన వివక్ష’ అంశం పెద్ద దుమారానికి దారితీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా, మరికొందరు మాత్రం రెహమాన్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఏ.ఆర్. రెహమాన్ స్వయంగా స్పందిస్తూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేస్తూ, ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు.

వీడియోలో రెహమాన్ మాట్లాడుతూ.. “భారత్ నాకు ఇల్లు. ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు గురువులు. నేను ఎప్పుడూ దేశాన్ని లేదా ప్రజలను విమర్శించలేదు. భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి. సంగీతం, కళాకారులకు ఇచ్చే గౌరవం తగ్గుతోందన్నదే నా ఉద్దేశం. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది, కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. నా వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి చూడటం సరికాదు.

నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కళ, సంగీతం, దేశం పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు. నా నిజాయితీని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. రెహమాన్ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వివరణతో వివాదానికి కొంతవరకు ముగింపు పలికే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.