నాకు వ్యతిరేకంగా రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు: ఏఆర్ రెహమాన్

నాకు వ్యతిరేకంగా రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు: ఏఆర్ రెహమాన్

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్ తనపై అసత్య పుకార్లను వ్యాప్తి చేస్తోందని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఈ రూమర్ల వల్ల తనను హిందీ చిత్రాల్లో పని చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవలే చనిపోయిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’కు రెహమాన్‌ స్వరకర్త కావడం గమనార్హం. రేడియో మిర్చీతో ఇంటర్వ్యూలో హిందీ సినిమాలు తక్కువగా చేస్తుండటానికి కారణం ఏంటనే దానిపై రెహమాన్ పైవ్యాఖ్యలు చేశారు.

‘మంచి సినిమాలకు నేను నో చెప్పను. కానీ అక్కడ (బాలీవుడ్‌)లో ఓ గ్యాంగ్ ఉందనుకుంటున్నా. తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సదరు గ్యాంగ్‌ నాపై అసత్యాలను ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు. ముఖేశ్ ఛాబ్రా తన దగ్గరకు వచ్చినప్పుడు రెండ్రోజుల్లో నాలుగు పాటలు చేసిచ్చానని రెహమాన్ చెప్పారు. ఆ సమయంలో ఛాబ్రా తనతో.. ‘చాలా మంది మీ (రెహమాన్) వద్దకు వెళ్లొద్దని ఏవేవో స్టోరీస్ చెప్పా’రని పేర్కొన్నారు. దీంతో తాను హిందీలో తక్కువ మూవీస్ చేయడానికి రీజన్ తెలిసిందని, అలాగే మంచి సినిమాలు తన వద్దకు ఎందుకు రావడం లేదో అర్థమైందన్నారు.

‘హిందీలో నేను తక్కువ సినిమాలు చేస్తున్నా. డార్క్ ఫిల్మ్స్‌ చేస్తున్నా. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా అక్కడో గ్యాంగ్ పని చేస్తోంది. కానీ నేను విధిని నమ్ముతా. ప్రతిదీ దేముడి నుంచే వస్తుందని నమ్ముతా. అందుకే నా వద్దకు వచ్చిన మూవీస్ చేస్తున్నా. దాంతోపాటు మిగిలిన పనులు చూసుకుంటున్నా. మీరు నా దగ్గరకు ఎప్పుడైనా రావొచ్చు. అందమైన సినిమాలు తీయండి. నా వద్దకు రావడానికి మీకు వెల్‌కమ్ చెబుతున్నా’ అని రెహమాన్ వివరించారు.