ఆఫీసర్లు అధికార పార్టీ పక్షమా? 

ఆఫీసర్లు అధికార పార్టీ పక్షమా? 
  • ఖమ్మంలో గుడిసెల కూల్చివేతపై జాతీయ బీసీ కమిషన్​ ఆగ్రహం
  • ఆఫీసర్లపై గవర్నర్, రాష్ట్రపతి, డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు: ఖమ్మం నగరంలోని రామచంద్రయ్యనగర్​ఎన్ఎస్పీ భూముల్లో ఇండ్లను కోల్పోయిన వాళ్లందరికీ 15 రోజుల్లోగా పరిష్కారం చూపించాలని  జిల్లా కలెక్టర్, అధికారులను జాతీయ బీసీ కమిషన్ ఆదేశించింది. బాధితులకు అదే ప్లేసులో లేదా వెలుగుమట్లలో ప్లాట్లు ఇవ్వాలని చెప్పింది. ఇండ్లు కోల్పోయిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించిన ఖమ్మం అర్బన్​ తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు సూచించింది. ఆఫీసర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతల కోసం పని చేస్తే, వారిపై గవర్నర్, రాష్ట్రపతి, డిపార్ట్​మెంట్​ఆఫ్​ పర్సనల్​ అండ్​ ట్రైనింగ్​(డీవోపీటీ)కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. జాతీయ బీసీ కమిషన్​ వైస్ చైర్మన్​ లోకేష్ కుమార్​ ప్రజాపతి, బీసీ కమిషన్​సభ్యుడు తల్లోజు ఆచారి బుధవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ముందుగా రామచంద్రయ్యనగర్​లో ఇండ్లు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తర్వాత టీచర్స్​ ట్రైనింగ్ అండ్​ డెవలప్​ మెంట్ సెంటర్​ (టీటీడీసీ)లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామచంద్రయ్యనగర్​ బాధితుల తరపున బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అదే ప్రాంతంలో ఎన్ఎస్పీ భూమిని రెండున్నర ఎకరాలు స్థానిక మంత్రికి చెందిన కాలేజీకి, మరికొంత భూమి ఓ ప్రైవేట్ స్కూల్ కు 59 జీవో కింద రెగ్యులరైజ్​ చేసిన అధికారులు పేదలకు మాత్రం పట్టాలివ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆఫీసర్లపై లోకేష్​ కుమార్, తల్లోజు ఆచారి ప్రశ్నల వర్షం కురిపించారు. 58 జీవో కింద రామచంద్రయ్యనగర్​ వాసులు దరఖాస్తు చేసుకుంటే ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని ఫైరయ్యారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, పాలకులకు పాద సేవ చేస్తారా అన్నారు. అసలు భూమి ఎన్ఎస్పీకి చెందినదైతే, రెవెన్యూ అధికారులు ఎలా దౌర్జన్యం చేసి వెళ్లగొడతారని మండిపడ్డారు. దీంతో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ రావు సమాధానమిచ్చారు. 1995లోనే ఈ భూమిని ఎన్ఎస్పీ అధికారులు రెవెన్యూకు అప్పగించారని చెప్పారు. ఏ రూల్స్ ప్రకారం వాళ్లను ఖాళీ చేయించారో చెప్పాలని అడగ్గా, గత ఏడాది జులైలో ఫస్ట్ నోటీస్​ ఇచ్చామని, అక్టోబర్​ లో రెండోసారి నోటీస్​ ఇచ్చిన తర్వాత యాక్షన్​ తీసుకున్నామని అడిషనల్ కలెక్టర్​చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​ డౌన్​ అమలు చేస్తున్న సమయంలో ప్రజలంతా ఎవరి ఇంట్లో వాళ్లుండాలని ఓ వైపు చెప్తుంటే, మీరు మాత్రం వాళ్ల ఇళ్లు కూలగొట్టి రోడ్లపై పడేస్తారా అని ఆఫీసర్లపై ఆచారి సీరియస్​ అయ్యారు. 
రాత్రికి రాత్రి ఎట్ల కూలగొడతరు
ఎలాంటి ఆల్టర్నేట్ చూపకుండా రాత్రికి రాత్రే ఇండ్లు ఎలా కూలగొడతారని లోకేష్​ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటికే 25 మందికి వేరేచోట్ల పట్టాలిచ్చామని ఆఫీసర్లు చెప్పగా, అదంతా అబద్ధమని బాధితులు చెప్పారు. అసలు బాధితులకు కాకుండా వేరే వాళ్లకు జాగాలిచ్చి, రామచంద్రయ్యనగర్​ బాధితులకు ఇచ్చినట్టుగా ఆఫీసర్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని కంప్లైంట్ చేశారు. కమిషన్​ ఎంక్వైరీ తర్వాత వారికి జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ సమాధానమిచ్చారు. కమిషన్ ఆదేశాల ప్రకారం 15 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామన్నారు. 68 మందిలో 25 మందికి పట్టాలిచ్చామని, మరో 8 మంది మాత్రమే అర్హులున్నారని గతంలో తహసీల్దార్​ చేసిన ఫీల్డ్ ఎంక్వైరీలో తేలిందన్నారు. కమిషన్​ ఆదేశాల మేరకు తహసీల్దార్​ రిజెక్ట్ చేసిన 33 మంది నుంచి కూడా మళ్లీ అప్లికేషన్లు తీసుకొని, వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నేతలు దేవకి వాసుదేవరావు, రామారావు, రవికుమార్, శ్యామ్​రాథోడ్, ఉపేందర్, వీరుగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.
15 రోజుల్లోగా ల్యాండ్​ ఇవ్వండి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇండ్లు కోల్పోయిన బాధితులకు 15 రోజుల్లోగా ల్యాండ్​ చూపించాలని నేషనల్​ బీసీ కమిషన్​ వైస్​ చైర్మన్​ లోకేష్​ కుమార్​ప్రజాపతి, మెంబర్​ తల్లోజు ఆచారి భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణం మేదరబస్తీలోని రైల్వేస్టేషన్​ సమీపంలోని తుమ్మలనగర్​లో ఆక్రమణల పేర పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రాంతాన్ని బుధవారం రాత్రి వారు సందర్శించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు 15 రోజుల్లో ల్యాండ్​ చూపించి అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను బీసీ కమిషన్​కు పంపాలని ఆదేశించారు. ల్యాండ్​ చూపించిన తర్వాత స్టేట్​గవర్నమెంట్​డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సెంట్రల్​నుంచి ప్రధాని ఆవాస్​ యోజన కింద ఇండ్లను మంజూరు చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. రైల్వే శాఖ అరాచకంపై ఆ శాఖ డీజీని పిలిపిస్తామన్నారు.  కూల్చివేతల టైంలో తీసుకున్న చర్యలు, కోర్టు ఆర్డర్​ కాపీలను కమిషన్​కు ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించారు.