నవరాత్రుల్లో ఒక్కపొద్దు ఉంటున్నారా?

నవరాత్రుల్లో ఒక్కపొద్దు ఉంటున్నారా?

దుష్టశిక్షణ, శిష్టరక్షణగావించే జగన్మాతను పరమభక్తితో నవరాత్రుల్లో కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో చాలామంది ఉపావాసాలు,  ఒక్కపొద్దు ఉంటారు.   అయితే కొత్తగా ఉపవాసం చేసేవాళ్లు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  ఏది తినాలో, ఏది తినొద్దో తెలియక చేసే పొరపాట్ల వల్ల హెల్త్‌ ఇష్యూస్ వస్తాయి.  కాబట్టి కొత్తగా ఉపవాసాలు చేసేవారు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

 వరుస ఉపవాసాలు వద్దు

మొదటిసారి ఒక్కపొద్దు ఉండేవాళ్లు  ఏమీ తినకుండా ఎక్కువసేపు ఉండకూడదు. ఒక్కరోజు లేదంటే  కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫాస్టింగ్ ఉంటే మంచిది. అలాగే అమ్మవారికోసం ఏ రకమైన ఉపవాసం చేయాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. మనకు రకరకాల ఉపవాసాలు ఉంటాయి.  పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉంటారు కొంతమంది. ఒక్కపూట తిని మిగతా రెండు పూటలు ఏమీ తినకుండా ఇంకొంతమంది ఉంటారు. నవరాత్రులు పూజ చేసేవాళ్లలో కొందరు వెజ్ ఐటమ్స్  మాత్రమే తింటూ నాన్​వెజ్​ ముట్టుకోరు. ఇలా మూడింట్లో మనం ఏ కెటగిరీనో ముందుగా నిర్ణయించుకోవాలి.  అంతేగాని  ఇష్టం వచ్చినట్టు డైట్‌‌ మార్చుకోకూడదు.

శరీరతత్వాన్ని బట్టి ఉపవాసాలు

ఉపవాసం, ఒక్కపొద్దు ఉండాలనుకునేవాళ్లు.. ముందుగా అలా చేస్తే తమ శరీరం సహకరిస్తుందో లేదో చెక్‌ చేసుకుంటే బెటర్‌‌.  కేవలం నీళ్లు, పండ్లతోశరీరం హాయిగా ఉండగలదా? లేదా? అని కూడా చూసుకోవాలి.

డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి

ఒక్కపొద్దు అనగానే చాలామంది నీళ్లు తాగడం కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. శరీరం ఎప్పుడూ హెడ్రేటెడ్‌గా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసిందే! కాబట్టి,  శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఉపవాసం వల్ల డైలీ శరీరానికి అందే లిక్విడ్స్‌‌ ఒక్కసారిగా ఆగిపోతే డీ హైడ్రేట్ అవుతుంది. సో, నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు, పాలు లాంటివైనా తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గదు. హెల్దీగా ఉంటారు.

డ్రై ఫ్రూట్స్ తినొచ్చు

ఈ నవరాత్రులు ఏమీ తినకుండా ఉండటం కంటే.. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది. దీనివల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజులో  ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే అలిసిపోకుండా ఉంటారు.

ఎక్కువ గ్యాప్ వద్దు

ఒక్కపొద్దు ఉన్నవారు.. ఫ్రూట్స్, లిక్విడ్స్, డ్రైఫ్రూట్స్ తింటూ ఉండాలి.  ఎక్కువ గ్యాప్ ఇచ్చి తినడం వల్ల కళ్లు తిరిగే అవకాశం ఉంది.

ప్యాకేజ్డ్‌‌ ఫుడ్‌‌కు దూరం

ఒక్కపొద్దు ఉన్న టైమ్‌లో … ఆకలి అవుతుందని బయటి ఫుడ్‌ గబగబ తినకూడదు. అలాగే ప్యాకింగ్ చేసిన బిస్కెట్లు, చిప్స్ లాంటివి కూడా తినకుండా ఉంటేనే మేలు. వాటికి బదులు ఫ్రూట్స్‌‌ తినాలి. లేదంటే అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు తినొచ్చు.

మెడిటేషన్ మంచిది

ఈ టైంలో మెడిటేషన్ చేయడం, శ్లోకాలు చదవడం చేయాలి. దానివల్ల బాడీ, మైండ్ ఆధీనంలో ఉంటాయి.