రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? : బండి సంజయ్

రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? :   బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కొట్టిపారేశారు. ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ఒకే స్వరాన్ని విన్పిస్తూ ప్రజల్లో భయందోళనలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లోని తన ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.

 ‘‘అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుంది. ఈ మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా.. డేట్, టైమ్, వేదిక మీరే ఫిక్స్ చేయండి. అదే సమయంలో  రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా?’’ అని సీఎం రేవంత్ , కేటీఆర్ కు సవాల్ విసిరారు. సంజయ్ అవినీతిపరుడంటూ కేటీఆర్, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. 

‘‘నేను అవినీతికి పాల్పడితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా.. నాపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆధారాలు చూపలేదు?  పదేండ్లు అధికారంలో ఉండి ఏం పీకినవ్. మీ ఆస్తిపాస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా?” అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని, జనం ఛీకొట్టినా ఆయనకు అహంకారం తగ్గలేదని, కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.