
అర్జెంటీనా మోడల్, నటి సిల్వినా లూనా ఆగష్టు 31న మరణించారు. 43 ఏళ్ల లూనా.. బ్యూనస్ ఎయిర్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. లూనా తన ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.
2021లో, లూనా ఒక కాస్మెటిక్ సర్జన్ ద్వారా ఒక ప్రక్రియను చేయించుకుంది. ఆ డాక్టర్.. లూనాలోకి పాలీమిథైల్‌మెథాక్రిలేట్‌తో కూడిన లిక్విడ్‌ను ఇంజెక్ట్ చేశారని ఓ నివేదిక తెలిపింది. అర్జెంటీనా నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్, ఫుడ్ అండ్ మెడికల్ టెక్నాలజీ ద్వారా పాలీమిథైల్మెథక్రిలేట్ పై ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. అంతకుముందు ఆమె కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకుంది. ఆమెకు మూత్రపిండ లోపం, హైపర్‌కాల్సెమియా ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఆమె వారానికోసారి డయాలసిస్ చేయించుకునేది. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలనే ఆశతో ఉన్న ఆమె.. 2015లో మియామీలో ఒక వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంది.
ఈ ఏడాది జూన్ 13న, సిల్వినా లూనా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరింది. జూన్ 29న ఆమెకు మత్తు ఇచ్చిన డాక్టర్లు.. ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆగస్టు 19న ఆసుపత్రి ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇందులో లూనా కైనెసియోలాజికల్, న్యూట్రిషనల్, సైకలాజికల్ రీహాబిలిటేషన్‌తో తనంతట తానుగా శ్వాస తీసుకుంటోందని తెలిపింది. కానీ ఆ తర్వాత శరీరమంతా బాక్టీరియా ఇన్ఫెక్ట్ కావడంతో ఆమెను లైఫ్ సపోర్ట్ పై ఉంచారు. సర్జరీ అనంతరం ప్రముఖ TV హోస్ట్ మరియానో కాప్రారోలా మరణించాడు. అయితే మరియానోకు సర్జరీ చేసిన అదే వైద్యుడు లూనాకు కూడా సర్జరీ చేశారు. అతను మరణించిన రెండు వారాల తర్వాత లూనా మరణించడం గమనార్హం.