
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ కోసం హరీశ్ రావు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని, కేసీఆర్ తర్వాత సీఎం క్యాండిడేట్‌గా కేటీఆర్‌నే చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రిలీజ్ చేసిన శ్వేతపత్రం మీద చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. చర్చలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ఆయనకు మంత్రి పదవి దక్కదని కామెంట్ చేశారు. దీనికి అంతే ఘాటుగా రాజగోపాల్ రెడ్డి బదులిచ్చారు. ‘‘అబద్ధాలను నిజమని చెప్పడంలో హరీశ్ రావుకు మేనమామ సాలు వచ్చింది. హరీశ్ రావుగారూ.. నేను ఎంత మొత్తుకున్నా మంత్రి పదవి రాదని మీరు అంటున్నారు. కానీ, మీరు ఎంత కష్టపడినా పార్టీలో మీరు సీఎం క్యాండిడేట్కాలేరు. కేసీఆర్ తర్వాత తన రాజకీయ వారసుడిగా కేటీఆర్‌నే ప్రకటిస్తారు తప్ప.. మిమ్మల్ని కాదు. తండ్రీకొడుకులు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తరు. వెన్నుపోటు పొడుస్తరు. జర జాగ్రత్తగా ఉండు’’ అంటూ రిప్లై ఇచ్చారు.
పోడియం వద్దకు దూసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మైక్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆయనకు మైక్ ఎలా ఇస్తారంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. కేపీ వివేకానంద, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లా రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, గంగుల తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ టైమ్‌లో జోక్యం చేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి సభను నడుపుతున్న రెండు మూడు రోజులకే ఎదురు దాడి చేయడం మంచిది కాదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. తాము ప్రతిపక్షంలో పదేండ్లు కూర్చున్నామని, కనీసం రెండు మూడు రోజులు కూడా వాళ్లు కూర్చోలేకపోతున్నారని ఫైరయ్యారు. పదేండ్ల పాటు మీరు మైక్ కట్చేయలేదా అని ప్రశ్నించారు. సభను బుల్డోజ్ చేస్తున్నారని, స్పీకర్‌ను బెదిరించడం పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. హరీశ్ రావుకు టైమ్ ఇవ్వాలని సూచించారని, అందుకు స్పీకర్ కూడా టైమిచ్చారని అన్నారు. కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేచి హరీశ్‌కు టైమ్ ఇవ్వొద్దంటూ స్పీకర్‌కే ఆర్డరేశారని విమర్శించారు.
మీకేం పనిపాటా లేవు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హరీశ్ రావు కామెంట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. తాను అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో ఉన్న టైమ్‌లోనూ కేటీఆర్ కూడా ఇలాగే వ్యాఖ్యానించారని వెంకట్ రెడ్డి అన్నారు. తమది నేషనల్ పార్టీ అని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే పీసీసీ చీఫ్‌ను ఎన్నుకుంటారని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లకు ఏ పనీపాటా లేదని మండిపడ్డారు. ‘మీ బావ, బామ్మర్దులు ఎట్ల కొట్టుకుంటరో నేను చెప్పాల్నా? మీరు బయటకు ఎలా ఉన్నా.. లోపల మాత్రం ఎట్ల కొట్టుకుంటారో అందరికీ తెలుసు. ఇది నేను చాలా సీరియస్‌గా చేస్తున్న కామెంట్’అని వెంకట్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
రూ.50 కోట్లు పెట్టి పీసీసీని కొనుక్కున్నరు : హరీశ్
ఆ చర్చ జరుగుతుండగానే హరీశ్ రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల్లాగా రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవిని తాము కొనుక్కోలేదని హరీశ్ రావు అనడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఆ మాటలను వెనక్కి తీసుకోకుంటే సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో మాటలను వెనక్కి తీసుకోవాలని హరీశ్ రావుకు స్పీకర్ తేల్చి చెప్పారు. దీనికి స్పందించిన హరీశ్ రావు.. ఇవి తన మాటలు కావని, ఒక సందర్భంలో కోమటిరెడ్డి బ్రదర్సే ఈ కామెంట్లు చేశారని, వీడియోలూ ఉన్నాయని, ఆ వ్యాఖ్యలనే తాను గుర్తు చేశానని చెప్పే ప్రయత్నం చేశారు. తన విషయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే తాను అన్న మాటలను కూడా వెనక్కి తీసుకుంటానన్నారు. తనను అన్నారు కాబట్టే.. తాను కూడా హరీశ్‌ను అనాల్సి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోవడంతో రికార్డుల నుంచి వాటిని తొలగించాలంటూ స్పీకర్ ఆదేశాలిచ్చారు.