చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో అర్జున్‌ శుభారంభం

చెన్నై  గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో అర్జున్‌ శుభారంభం

చెన్నై: ఇండియా టాప్ గ్రాండ్ మాస్టర్‌‌, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ చెన్నై  గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించాడు. గురువారం జరిగిన మాస్టర్స్ తొలి రౌండ్‌లో టైటిల్ ఫేవరెట్‌ అర్జున్ అద్భుతమైన ఆటతో అమెరికా ఆటగాడు అవాండర్ లియాంగ్‌ను ఓడించి ఒక పాయింట్ సొంతం చేసుకున్నాడు. అయితే, నిహాల్ సరీన్‌కు నిరాశ ఎదురైంది. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌తో జరిగిన గేమ్‌లోలో నిహాల్ ఓటమి పాలయ్యాడు. 

విదిత్ గుజరాతీ డచ్ ఆటగాడు జోర్డెన్ వాన్ ఫోరెస్ట్‌తో పాయింట్ పంచుకోగా.. చెన్నై గ్రాండ్‌ మాస్టర్లు ప్రణవ్ – కార్తికేయన్ మురళి మధ్య జరిగిన గేమ్‌  డ్రాగా ముగిసింది. అనిష్ గిరి (డచ్‌) కూడా రే రాబ్‌సన్‌ (అమెరికా)తో డ్రా చేసుకున్నాడు. చాలెంజర్స్ సెక్షన్‌లో తెలుగు గ్రాండ్‌ మాస్టర్ ద్రోణవల్లి హారికకు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ఆమె కోల్‌కతాకు చెందిన దీప్తయన్ ఘోష్ చేతిలో ఓడిపోయింది. ఆర్యన్ చోప్రా, హర్షవర్ధన్ జీబీ కూడా  ఓడిపోగా.. ఆర్‌‌. వైశాలి, అభిమన్యు పురాణిక్, ఇనియన్ పా తమ మ్యాచ్‌లను డ్రా చేసుకున్నారు.