భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీలో త్వరలోనే వివాహ బాజాలు మోగనున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సానియా చందోక్ తో అర్జున్ వివాహం ఖరారైంది. అర్జున్ ఈ సంవత్సరం మార్చి 5, 2026న సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేడుక 2026 మార్చి 5న జరగనున్నటు టాక్. ఈ జంట ఆగస్టు 2025లో నిశ్చితార్ధం చేసుకున్నారు.
ఎవరు ఈ సానియా చందోక్:
సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఘాయ్ కుటుంబం హోటల్ అండ్ ఆహార పరిశ్రమలో ఎక్కువ వినిపించే పెద్ద పేరు. వీరికి ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ (ఐస్ క్రీం బ్రాండ్) వంటి వ్యాపారాలు ఉన్నాయి. సమాచారం ప్రకారం అర్జున్, సానియా ఒక ప్రైవేట్ ఫంక్షన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి కుటుంబం ఇంకా సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
సోషల్ మీడియాలో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్ నిర్వహించిన సచిన్ అందులో ఒకతను సచిన్‌ని 'అర్జున్ నిజంగా నిశ్చితార్థం చేసుకున్నాడా ? అని అడగ్గా, దీనికి సచిన్ అవును, నిజంగానే అర్జున్ నిశ్చితార్థం జరిగింది, అతని జీవితంలోని కొత్త దశకి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము అని సమాధానం ఇచ్చారు.
అర్జున్ క్రికెట్ కెరీర్:
అర్జున్ లెఫ్ట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. 25 ఏళ్లలో అతను ఇండియన్ క్రికెట్‌లో గోవాకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన క్రికెట్ కెరీర్ 2020-21 సీజన్‌లో ముంబైతో ప్రారంభించి హర్యానాతో జరిగిన T20 మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు అతను ముంబై జూనియర్ టీమ్‌లకు ఆడుతూ, భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. 2022-23 సీజన్‌లో అర్జున్ గోవా జట్టులోకి మారి ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ కెరీర్ ప్రారంభించాడు.
రెడ్-బాల్ ఫార్మాట్‌లో అర్జున్ 17 మ్యాచ్‌ల్లో ఆడగా, ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 532 పరుగులు చేసి 37 వికెట్లు తీసాడు. వాటిలో ఒకసారి ఐదు వికెట్లు, రెండుసార్లు నాలుగు వికెట్లు ఉన్నాయి. లిస్ట్ ఎ క్రికెట్‌లో గోవా తరపున 17 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 76 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతను ముంబై ఇండియన్స్ తరపున ఐదు మ్యాచ్‌లలో 73 బాల్స్ వేసి 38.00 సగటుతో మూడు వికెట్లు తీసాడు, అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ తొమ్మిది పరుగులకి ఒక వికెట్ తీసాడు. అతని ఎకానమీ రేటు 9.36, స్ట్రైక్ రేట్ 24.3. ఐపీఎల్ 2026 సీజన్ లో అర్జున్ లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడనున్నాడు.
