వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ

వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ

దోహా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌ విశ్వవేదికపై తన ఎత్తులతో అదరగొడుతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్‌‌‌‌ చెస్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో కాంస్యంతో మెరిసిన అతను బ్లిట్జ్‌‌‌‌ విభాగంలోనూ టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్నాడు. సోమవారం మొదలైన బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ను ఓడించడంతో పాటు తొలి 13 రౌండ్లలో  8  గేమ్స్‌‌‌‌లో విజయం సాధించాడు. మరో 4  రౌండ్లను డ్రా చేసుకున్న అతను ఒకే ఒక్క ఓటమితో 10  పాయింట్లతో  అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా), మాక్సిమ్ లాగ్రావ్ (ఫ్రాన్స్‌‌‌‌) కూడా చెరో పది పాయింట్లతో నిలిచారు.

ర్యాపిడ్‌‌‌‌లో థర్డ్ ప్లేస్‌‌‌‌తో బ్రాంజ్ నెగ్గిన జోరును అర్జున్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌లోనూ కొనసాగించాడు. చకచకా తెలివైన ఎత్తులు వేస్తూ తొలి ఐదు గేమ్స్‌‌‌‌లోనూ విజయం అందుకున్నాడు. ఆరో గేమ్‌‌‌‌లో డచ్‌‌‌‌ గ్రాండ్ మాస్టర్ జోర్డెన్ వాన్ ఫారెస్ట్ చేతిలో ఓడిపోయాడు. అయినా టాప్ ప్లేస్‌‌‌‌ నిలబెట్టుకున్న తెలంగాణ కుర్రాడు వెంటనే పుంజుకున్నాడు. ఏడో రౌండ్‌‌‌‌లో 44 ఎత్తుల్లో డెనిస్ మఖ్నేవ్‌‌‌‌కు చెక్ పెట్టాడు. తర్వాతి  గేమ్‌‌‌‌ను అలీరెజా ఫిర్జౌసాతో డ్రా చేసుకున్న అర్జున్‌‌‌‌.. తొమ్మిదో రౌండ్‌‌‌‌లో  ర్యాపిడ్ చాంప్‌‌‌‌ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ను ఓడించి ఔరా అనిపించాడు. 

నల్లపావులతో ఆడిన వరంగల్ ప్లేయర్ 45 ఎత్తుల తర్వాత టైమ్‌‌‌‌ కంట్రోల్ ఆధారంగా కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ పనిపట్టి కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. అర్జున్ చేతిలో ఓడిన నిరాశలో  కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ టేబుల్‌‌‌‌ను గట్టిగా కొట్టాడు. అదే జోరుతో పదో గేమ్‌‌‌‌లో ఉజ్బెక్ గ్రాండ్‌‌‌‌మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్టోరోవ్ ను ఓడించిన అర్జున్‌‌‌‌.. తర్వాతి రెండు గేమ్స్‌‌‌‌లో మేటి ప్లేయర్లు  కరువానా, లాగ్రావ్ తో పాటు 13వ గేమ్‌‌‌‌లో  డిమిత్రివిచ్ డుబోవ్ (నార్వే)తో డ్రా చేసుకున్నాడు.  

ఆర్. ప్రజ్ఞానంద, ఎమ్‌‌‌‌. ప్రణేష్‌‌‌‌, గౌతమ్‌‌‌‌ కృష్ణ తలో 9 పాయింట్లతో వరుసగా 13, 14, 15వ స్థానాల్లో నిలిచారు.   ఇక, విమెన్స్ సెక్షన్‌‌‌‌లో ర్యాపిడ్ బ్రాంజ్ విన్నర్ కోనేరు హంపితో పాటు ఇండియా ప్లేయర్లంతా నిరాశపరిచారు. తొలి 10 రౌండ్లలో దివ్యా దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ 6 పాయింట్లు నెగ్గి 34 ర్యాంక్‌‌‌‌లో నిలవగా.. ద్రోణవల్లి హారిక, పద్మినీ రౌత్‌‌‌‌ చెరో 5.5 పాయింట్లు, హంపి 5 పాయింట్లు మాత్రమే రాబట్టారు. మంగళవారం ఓపెన్ సెక్షన్‌‌‌‌లో మరో ఆరు రౌండ్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌లో మరో ఐదు రౌండ్స్‌‌‌‌తో పాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. 

అర్జున్, హంపికి పీఎం మోదీ అభినందన

ఫిడే ర్యాపిడ్ చెస్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో కాంస్య పతకాలు సాధించిన అర్జున్, హంపిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘వరల్డ్ ర్యాపిడ్ చెస్‌‌‌‌లో అర్జున్ కాంస్యం గెలవడం గర్వకారణం.  అతని పట్టుదల అద్భుతం. భవిష్యత్తులో తను మరిన్ని విజయాలు సాధించాలి’ అని మోదీ ఎక్స్‌‌‌‌లో పోస్ట్ చేశారు.  ఆట పట్ల హంపి అంకితభావం ఎంతో ప్రశంసనీయమని అన్నారు.