
తమిళనాడులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్‌లోకి చొరబడ్డ దుండగులు.. భారీ మొత్తంలో బంగారం చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం బ్రాంచ్ తెరిచిన (9:30)కొద్దిసేపటికే కస్టమర్ల రూపంలో హెల్మెట్ లో ధరించిన అయిదుగురు దుండగులు.. లోపలికి ప్రవేశించి 25 కేజీలకుపైగా బంగారాన్ని, రూ.96 వేల నగదును దోచుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
చోరీ జరిగిన సమయంలో ఆఫీసులో ఐదుగురు ఉద్యోగులు, ముగ్గురు కస్టమర్లు మాత్రమే ఉన్నారు. మొదట సెక్యూరిటి గార్డు ను కొట్టి లోపలకు తీసుకువెళ్లిన దొంగలు.. లోపలున్న సిబ్బందిని తుపాకీతో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్ తాళం తెరిచి అందులో ఉన్న సొమ్మును దోచుకున్నారు. ఆ తర్వాత దొంగలందరూ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి.. దుండగుల కోసం గాలిస్తున్నారు.