ఇకపై రెగ్యులర్​ నియామకాల్లేవు.. ‘అగ్నిపథ్’ మాత్రమే

ఇకపై రెగ్యులర్​ నియామకాల్లేవు..  ‘అగ్నిపథ్’ మాత్రమే

త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్​ నియామకాలు ఉండవని..  కేవలం అగ్నిపథ్ పథకం ద్వారా నియామకాలు జరుగుతాయని రక్షణ శాఖ అడిషనల్​ సెక్రెటరీ, లెఫ్టినెంట్​ జనరల్​ అనిల్​ పురి  స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసుకున్న వారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని తేల్చి చెప్పారు.  అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని  వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. త్రివిధ దళాలు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అగ్నిపథ్​ స్కీమ్​ గురించి రాద్ధాంతం అనవసరమని, మూడు దశాబ్దాల క్రితమే (1989) ఈ స్కీమ్​ ను అమల్లోకి తెచ్చే దిశగా సైన్యంలో కసరత్తు మొదలైందని అనిల్​ పురి వెల్లడించారు. సైన్యానికి యువ తేజస్సును అద్దాలనే ఏకైక సంక్పలంతో అగ్నిపథ్​ ను ప్రారంభించామని చెప్పారు.  ‘‘2030లోగా దేశ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్లలోపు వారే ఉంటారు. ఇదే సమయంలో మన సైన్యంలో మాత్రం 32 ఏళ్లవారు ఎందుకు ఉండాలి ?  సైన్యాన్ని కూడా యంగ్​ గా మార్చేందుకు అగ్నిపథ్​ బాటలు వేస్తుంది”అని పేర్కొన్నారు. త్రివిధ దళాల అధిపతులు, జనరల్​ రావత్​ కలిసి గత రెండేళ్లుగా దీనిపై దేశవిదేశాల్లో లోతైన అధ్యయనం చేశారని గుర్తుచేశారు. ‘మనదేశంలో సగటు సైనికుడి వయస్సు 32 ఏళ్లు.  చాలా దేశాల్లో ఇది 24, 26, 28 ఏళ్లు మాత్రమే‘ అని వివరించారు.    ‘‘సైన్యంలోని 35 నుంచి 38 ఏళ్లలోపు వారు  వేలాది మంది ఏటా  ప్రీ మెచ్యూర్​ రిటైర్మెంట్​ తీసుకుంటున్నారు. వీళ్లు బయటికి వెళ్లి ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పుడూ ఆలోచించలేదు”అని అనిల్​ పురి కామెంట్​ చేశారు.  

వచ్చే నాలుగైదు ఏళ్లలో ..

వచ్చే నాలుగైదు ఏళ్లలో ఏటా 50వేల నుంచి 60వేల మందిని,.. ఆ తర్వాత 90వేల నుంచి 1.25 లక్షల  మంది అగ్నివీర్లను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నట్లు అనిల్​ పురి  వెల్లడించారు.  ప్రస్తుతం పనిచేస్తున్న సాధారణ సైనికులకు సియాచిన్, ఇతర ప్రాంతాలలో వర్తించే భత్యం ‘అగ్నివీర్'లకు కూడా లభిస్తుందన్నారు.  వారిపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు.  దేశ సేవలో ప్రాణత్యాగం చేస్తే అగ్నివీర్స్‌కు కోటి రూపాయల పరిహారం లభిస్తుందని తెలిపారు. ‘‘అగ్నివీర్లకు సాధారణ సైన్యంతో సమానంగా అలవెన్సులు ఉంటాయి.  సేవానిధి ప్యాకేజి ద్వారా వారికి నాలుగేళ్ల తర్వాత డబ్బులు అందుతాయి”అని వివరించారు. ‘‘ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్‌ కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూలై 24న రాతపరీక్ష, డిసెంబర్ 30లోపు శిక్షణ ప్రారంభం అవుతుంది.  నావికాదళం అగ్నివీర్ల కోసం 25 జూన్ వరకు ప్రకటన జారీ చేస్తాం. నెల రోజుల్లోపు నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 21 నాటికి మా తొలి అగ్నివీర్ శిక్షణ మొదలవుతుంది.  ఐఎన్ఎస్- ఒడిశాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నేవీ అగ్నివీర్లలో యవతీయువకులు ఇద్దరూ ఉంటారు“అని వెల్లడించారు. 

రెచ్చగొట్టి ఇలా చేయించారు..

విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అనిల్​ పురి స్పందిస్తూ.. “పలుచోట్ల కొందరు కోచింగ్​ సంస్థల వాళ్లు, అసాంఘిక శక్తులు ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టి  ఇలా చేయించారు. పోలీస్  వేరిఫికేషన్​ లేకుండా ఎవరూ ఆర్మీలోకి రాలేరు.  అభ్యర్థులు సమయం వేస్ట్​ చేయకుండా ప్రిపరేషన్​ ప్రారంభించాలి”అని తెలిపారు.  ‘‘విధ్వంసాలకు పాల్పడినవారికి ఆర్మీలో అవకాశమే లేదు.  అగ్నివీర్ల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుంది. ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనలేదని అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది”అని చెప్పారు.