
ఆర్మీలో చేరాలన్నది అతని కల. అందుకోసం ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. కానీ అధికారులు మాత్రం రిక్రూట్మెంట్ ఊసెత్తకపోవడంతో వినూత్నంగా నిరసన తెలపాలని అనుకున్నాడు. ఏకంగా 350 కిలోమీటర్లు పరిగెత్తి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు.
రాజస్థాన్కు చెందిన సురేశ్ బిచార్ వయసు 24 ఏళ్లు. సైన్యంలో చేరాలన్నది అతని కల. కానీ కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. దీంతో రిక్రూట్మెంట్ డ్రైవ్ తిరిగి ప్రారంభించాలంటూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. అందులో పాల్గొనాలని భావించిన సురేశ్ పనిలో పనిగా తన నిరసనను వినూత్నంగా తెలపాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకొని రాజస్థాన్లోని సికార్ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. దాదాపు 350 కిలోమీటర్ల దూరాన్ని 50 గంటల్లో చేరుకున్నాడు. రోజూ ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి 11 గంటలకల్లా ఏదో ఒక పెట్రోల్ బంక్కు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకునేవాడు. అలా గంటకు దాదాపు 7 కిలోమీటర్లు చొప్పున పరిగెత్తి చివరకు ఏప్రిల్ 2నాటికి ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొన్నాడు. సురేష్ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో అతని పట్టుదలను పలువురు ప్రశంసిస్తున్నారు.
#WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI
— ANI_HindiNews (@AHindinews) April 5, 2022
ఆర్మీలో చేరేందుకు సురేశ్ 2015 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2018లో నాగౌర్ లో నిర్వహించిన రిక్రూట్ మెంట్ ర్యాలీలో 4నిమిషాల 4 సెకన్లలో 1600 మీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం సంపాదించలేకపోయారు. ఈ సారి ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తే తప్పకుండా ఉద్యోగం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.