ఆర్మీ జవాన్​ మిస్సింగ్

ఆర్మీ జవాన్​ మిస్సింగ్

సిద్దిపేట, వెలుగు: దేశం కోసం పనిచేయాలన్న తపన అతన్ని  ఆర్మీలో జాయినయ్యేలా చేసింది.. ఎన్నో కష్టాలకోర్చి  అనుకున్న లక్ష్యాన్ని సాధించినా అనుకోని రీతిలో అతని ఆచూకీ తెలియకుండాపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సాయికిరణ్​రెడ్డి(22) రెండేళ్ల క్రితం ఆర్మీ పరీక్షలు పాసై  ఏడాదిన్నర ట్రైనింగ్​పూర్తి చేసుకున్నాడు. అనంతరం  8 నెలల కింద  పంజాబ్​ రాష్ట్రంలోని ఫరీద్​కోట్ లో ఆర్మీ జవాన్ గా డ్యూటీలో చేరాడు. 20 రోజుల క్రితం సెలవుపై పోతిరెడ్డిపల్లికి వచ్చాడు. డిసెంబర్ 7న డ్యూటీలో చేరడం కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లాడు. తర్వాత రోజు నుంచి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. డ్యూటీలో చేరకపోవడం, అతని నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సాయికిరణ్ రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో అతని సోదరుడు భానుప్రకాశ్ రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆర్మీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన  పోలీసులు ఈ కేసును ఢిల్లీ ప్రాంతానికి ట్రాన్స్​ఫర్ చేశారు. భానుప్రకాశ్​రెడ్డి రెండు రోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కలసి తన సోదరుడు కనిపించడం లేదన్న విషయం చెప్పారు. దీనిపై  కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సాయికిరణ్​రెడ్డి మిస్సయి వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ  లభించకపోవడంపై అటు కుటుంబీకులు, ఇటు గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాన్​ఆచూకీ కనుగొనే దిశగా చర్యలు చేపట్టాలని  కోరుతున్నారు.