
- ఆర్మీ మేజర్ సహా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
- పాకిస్తాన్ టెర్రరిస్ట్ హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ ఒకరు మృతిచెందారు. ఆర్మీ మేజర్ సహా నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుప్వారా జిల్లాలో ఎల్వోసీ వద్ద చొరబాట్లను అడ్డుకునేందుకు శనివారం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో మన ఆర్మీపైకి పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) కాల్పులు జరిపింది. మన ఆర్మీ కూడా ఎదురుకాల్పులు చేపట్టింది. ఎన్కౌంటర్లో ఓ జవాన్ వీరమరణం పొందారని, మేజర్ సహా నలుగురు గాయపడ్డారని ఆర్మీ తెలిపింది.
పాక్‌కు చెందిన ఓ టెర్రరిస్టు కూడా హతమయ్యాడని తెలిపింది. ముందుగా సెక్యూరిటీ పోస్టుపైకి ముగ్గురు చొరబాటుదారులు గ్రనైడ్ విసరడంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. బీఏటీ కాల్పులకు తెగబడిందని పేర్కొంది. కాగా, నాలుగురోజుల్లో ఇది రెండో ఎన్కౌంటర్. ఈ నెల 24న కుప్వారా జిల్లా లోలబ్ లో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఓ జవాన్ చనిపోయాడు.