- ర్యాలీల కంటే ముందే రాష్ట్ర యువత కోసం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్
- వరదలు, విపత్తుల్లో ప్రత్యేక చొరవ చూపుతామని వెల్లడి
- మూసీ ప్రక్షాళన అద్భుత ప్రాజెక్టు అంటూ ఆర్మీ ఉన్నతాధికారుల ప్రశంసలు
హైదరాబాద్, వెలుగు: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణ ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యంగా జిల్లాల్లో ముందస్తు శిక్షణా కేంద్రాలు (ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్- ఇన్ -చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేశ్ పుష్కర్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన భేటీలో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. ఇండియన్ ఆర్మీ చేపడుతున్న వివిధ నియామకాలకు దేశవ్యాప్త రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరగడానికి ముందే, తెలంగాణ యువత కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించాలని సీఎం కోరగా, ఆర్మీ ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేశారు.
సైన్యంలో చేరాలనుకునే స్థానిక యువతకు మెరుగైన అవగాహన, శిక్షణ కల్పించడంతో పాటు విపత్తుల సమయంలో ఆర్మీ మరింత క్రియాశీలక పాత్ర పోషించడం, ప్రభుత్వం చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాముఖ్యత వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. ఆర్మీ నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో క్రీడలు, శారీరక సామర్థ్య శిక్షణను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సీఎం చెప్పారు. సీఎం చేసిన విజ్ఞప్తికి లెఫ్టినెంట్ జనరల్ రాజేశ్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లకు ముందే తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సుముఖత ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భాల్లో బాధితులను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యలు అందించడంలో ఆర్మీ యంత్రాంగం మరింత వేగంగా పనిచేయాలని సీఎం కోరగా, దీనిపై ప్రత్యేక చొరవ తీసుకునేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మూసీ ప్రక్షాళనపై ప్రశంసలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును లెఫ్టినెంట్ జనరల్ రాజేశ్ పుష్కర్ ప్రత్యేకంగా కొనియాడారు. హైదరాబాద్ మహానగరాన్ని భావితరాల కోసం రక్షించడానికి, పెరుగుతున్న నగర కాలుష్యాన్ని నియంత్రించడానికి మూసీ పునరుజ్జీవనం ఎంతగానో అవసరమని ఆయన పేర్కొన్నారు. నగరానికి ఉన్న చారిత్రక వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ భేటీలో మేజర్ జనరల్ శ్రీనివాస్ రావుతో పాటు ఆర్మీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
