అర్హుల ఓటు నమోదు చేయించేందుకు ఆధారాలు సేకరించాలి

అర్హుల ఓటు నమోదు చేయించేందుకు ఆధారాలు సేకరించాలి
  • కాంగ్రెస్ స్టేట్ ఇన్​చార్జీ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అనామలీస్ జాబితాలో ఉన్న ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎల్ఏలను, పార్టీ నేతలను కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ కోరారు. బుధవారం మూడో రోజు కూడా ‘సర్’పై జూమ్ లో  హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ మాట్లాడారు. అనామలీస్ జాబితాలో 73 లక్షల ఓట్లు  చేరడంపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలు.. వాటిని నిశితంగా పరిశీలన చేసి అందులో అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు అవసరమైన ఆధారాలను వెంటనే సేకరించాలని బీఎల్ఏలతో పాటు డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. 

73 లక్షల ఓటర్ల వివరాలు బూత్ ల వారీగా ఇవ్వండి..

సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 73 లక్షల ఓట్లను అనామలీస్ జాబితాలో చేర్చడంపై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని నేతలు కలిశారు. తొలగించిన ఓట్లను పునఃపరిశీలించాలని,  లోతుగా దర్యాప్తు చేయకుండా ఏ ఒక్క ఓటునూ తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. 

అలాగే, తొలగించిన ఓట్లను బూత్​ల వారీగా ఇవ్వాలని కోరారు. ఈమేరకు పీసీసీ ఎలక్షన్​ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేశ్ కుమార్ సుదర్శన్ రెడ్డికి  వినతి పత్రం అందించారు. బూత్ ల వారీగా ఎన్ని ఓట్లు అనామలీస్ జాబితాలో  చేర్చారనే వివరాలు వచ్చాక.. బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరును కలిసి వారి నుంచి పూర్తి వివరాలు, ఆధారాలు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత  తిరిగి ఓటు హక్కు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని, దీనికి ఎన్నికల అధికారులు సహకరించాలని ఆయన కోరారు.