- ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే, గాంధీ జయంతికి సమావేశాలు ఏర్పాటు
- ‘పంచాయత్ నిర్ణయ్’ పోర్టల్‌లో ఫొటోలు, వీడియోల అప్ లోడ్
- కలెక్టర్లు, డీపీఓలకు పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి వంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న దినోత్సవాల్లో గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీఓలకు పంచాయతీ రాజ్ శాఖ ఆర్డర్లు పంపింది. ఈ గ్రామ సభలకు అన్నిశాఖలకు చెందిన అధికారులు హాజరై కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. గ్రామ సభల షెడ్యూల్, సభలో తీర్మానించిన వివరాలు, ఫొటోలు, షార్ట్ వీడియోలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పంచాయత్ నిర్ణయ్' పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
తాగునీరు, పారిశుధ్యం, భూ-ఆధార్, ఆరోగ్యం - పోషణ్ అభియాన్, నషా ముక్త్ భారత్, దివ్యాంగుల సంక్షేమం, యువతకు నైపుణ్య శిక్షణ, గ్రామీణ యువతకు ఐటీఐ కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించనున్నారు. 'మేరా గావ్ మేరీ ధరోహర్' లో భాగంగా గ్రామ సాంస్కృతిక విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు, జానపద కళారూపాల డిజిటల్ రికార్డింగ్ డేటాను పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించింది. గిరిజన, ఆదివాసీ ఆవాసాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా వచ్చే డిసెంబర్ వరకు పొడిగించిన 'జల్ జీవన్ మిషన్ 2.0' కింద నీటి అవసరాలను గుర్తించాలని పేర్కొంది. ఈ సభలకు సంబంధించిన రిపోర్టును కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని డీపీఓలను ఆదేశించింది.
