- పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
- ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపణ
- హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జర్పుల సాయికుమార్(25) బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు.
సుమారు ఆరు గంటలకు పైగా నిరసన తెలిపారు.కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం బండలేమూర్ హర్జన్‌తండాకు చెందిన సాయికుమార్ 2024లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ పీరియడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
గత నెల నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా, అక్కడ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న సాయికుమార్.. విధుల్లో భాగంగా అర్ధరాత్రి ఒంటిగంటకు డీఎస్‌ఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని డీసీపీ కార్యాలయ సిబ్బందికి అందించాల్సి ఉంది. అయితే రాత్రి 2 గంటలైనా ఏసీపీ కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో డీసీపీ కార్యాలయ సిబ్బంది ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో సెక్షన్ ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ సుమారు 2.30 గంటలకు ఏసీపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించగా.. అక్కడి రెస్ట్‌రూమ్‌లో సాయికుమార్ శాలువాతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
వేధింపుల వల్లే..
పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే సాయికుమార్ చనిపోయాడని తల్లిదండ్రులు విజయ, ఓడియ, కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు ప్రస్తుతం చేస్తున్న పని ఇష్టం లేదని సాయికుమార్ స్నేహితులతో చెప్పినట్లు, సూసైడ్ నోట్ లో కూడా రాసినట్లు సమాచారం. కాగా సాయికుమార్ ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్నందున చదువుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ఏసీపీ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
ఏసీపీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం..
మృతుడి కుటుంబ సభ్యులు ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు ఇతర ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, డీసీపీ రామేశ్వర్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామని, సాయికుమార్ తండ్రికి పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
