ఫండ్స్ లేవంటే ..ఆరోగ్యశాఖ నడవది

ఫండ్స్ లేవంటే ..ఆరోగ్యశాఖ నడవది

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘నిధులు లేవంటే మిగతా శాఖలు నడిచినట్టు, ఆరోగ్యశాఖ నడవదు. వానలొచ్చినా, వరదలొచ్చినా హెల్త్‌‌కు నిధులివ్వాల్సిందే’ అని హెల్త్ మినిస్టర్‌‌‌‌ ఈటల రాజేందర్ అన్నారు. నిధులు ఉన్నా, లేకున్నా దవాఖాన్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఆరోగ్య శాఖలో అనవసర ఖర్చులను తగ్గించుకుని అవసరమైన చోట వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ర్టంలోని 9 జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా హాస్పిటళ్లను జిల్లా హాస్పిటళ్లుగా అప్‌‌గ్రేడ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.576.78 కోట్లు ఖర్చు అవుతుండగా, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ ఖర్చును భరిస్తున్నాయన్నారు. ఈ ఏడాది రూ.214.12 కోట్లతో భవనాలు నిర్మిస్తామన్నారు. ఆరోగ్యశాఖలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ఈటల శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్స్‌‌

కాలిన గాయాలతో వచ్చే వారిని ట్రీట్ చేసేందుకు రూ.1.5 కోట్లతో వనపర్తి, నాగర్‌‌‌‌కర్నూల్‌‌, గజ్వేల్ హాస్పిటళ్లలో బర్న్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని ఈటల వెల్లడించారు. 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్స్‌‌ ఏర్పాటు చేసి, అన్ని రకాల టెస్టులను ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 17 జిల్లా కేంద్రాల్లో బిల్డింగ్‌‌ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. వీటిల్లో యంత్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు రూ.24 కోట్ల మంజూరుకు అనుమతులిచ్చామని తెలిపారు.

గాంధీలో 200 బెడ్లతో ఎంసీహెచ్‌‌

హైదరాబాద్‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌లో అత్యాధునిక మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని(ఎంసీహెచ్‌‌) ఏర్పాటు చేయనున్నట్టు ఈటల వెల్లడించారు. అందులో 200 పడకలు ఉంటాయని, రూ.30 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సెంటర్‌‌‌‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందన్నారు. కేసీఆర్‌‌‌‌ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీలు పెరిగాయని, మెటర్నల్ మోర్టాలిటీ రేట్‌‌ తగ్గిందని చెప్పారు. కేసీఆర్ కిట్‌‌ను ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలో అమలు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన 50 పీహెచ్‌‌సీలను 2 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే అన్ని దవాఖాన్లలో డాక్టర్లు, సిబ్బంది రేషనలైజేషన్ చేస్తామన్నారు. వరంగల్‌‌లోని కాకతీయ, ఆదిలాబాద్‌‌లోని రిమ్స్ టీచింగ్ హాస్పిటళ్లలో రీజనల్ కేన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసి, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.480 కోట్లు ఉన్నాయని, క్రమంగా చెల్లిస్తామన్నారు. నీలోఫర్‌‌‌‌లో జరుగుతున్న క్లినికల్‌‌ ట్రయల్స్‌‌లో చిన్న చిన్న ఉల్లంఘనలు జరిగాయని ఈటల చెప్పారు. భవిష్యత్​లో అవి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

హైవేలపై ట్రామా కేర్ సెంటర్లు

రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించే ఉద్దేశంతో రాష్ర్టంలోని పలు హైవేలపై ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ సెంటర్ల కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. రాజీవ్ రహదారిపై గజ్వేల్‌‌, సిద్దిపేట, కరీంనగర్‌‌‌‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌లలో.. నాగ్‌‌పూర్ హైవేపై తూప్రాన్‌‌, కామారెడ్డి, నిజామాబాద్‌‌, నిర్మల్, ఆదిలాబాద్​లలో.. విజయవాడ హైవేపై చౌటుప్పల్‌‌, నల్గొండ, సూర్యాపేట, కోదాడలలో.. బెంగళూరు హైవేపై మహబూబ్‌‌నగర్‌‌‌‌, గద్వాలలో.. వరంగల్ హైవేపై బీబీనగర్‌‌‌‌, జనగామ, వరంగల్, ములుగుతోపాటు ఖమ్మం, కొత్తగూడెం, మిర్యాలగూడ, జగిత్యాల, హుజూరాబాద్‌‌, మహబూబాబాద్‌‌, సంగారెడ్డి, తాండూర్‌‌‌‌ తదితర ఏరియాల్లో ట్రమాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.