జనవరి 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్

జనవరి 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్‌‌‌‌పోర్టులో ఏకంగా 100 చార్టర్డ్‌‌ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువు ఉన్న డోలు.. ప్రత్యేక రథంలో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది. మరోవైపు రామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబసభ్యులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీ రామ్ తదితరుల ఫ్యామిలీ మెంబర్లను కూడా ఈ శుభకార్యానికి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌‌కే అద్వానీ ఈ వేడుకలకు హాజరుకానున్నారని వీహెచ్‌‌పీ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు.


లక్నో:  ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యలో 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  వెల్లడించారు. గురువారం అహ్మదాబాద్‌‌‌‌, అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్ గా  నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యోగి ఆదిత్యనాథ్  పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఎం మాట్లాడుతూ.. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన వాల్మీకి మహర్షి  అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని తెలిపారు. ఫ్లైట్స్ ల్యాండింగ్ తో  ఎయిర్‌‌‌‌పోర్టు సామర్థ్యాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు నాల్గవ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి థ్యాంక్స్ చెప్పారు. సింధియా మాట్లాడుతూ.. అయోధ్యను అహ్మదాబాద్‌‌‌‌తో కనెక్ట్ చేయడానికి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ  సందర్భంగా  నలుగురు ప్రయాణికులు రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి వేషధారణలో అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారితో ఇండిగో మెనేజ్మెంట్, ఇతర ప్యాసింజర్లు ఫొటోలు దిగి సంబురపడ్డారు. 

వేడుకకు అద్వానీ వస్తారు: వీహెచ్ పీ 

అయోధ్యలో 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు బీజేపీ అగ్రనేత ఎల్‌‌‌‌కే అద్వానీ(96) కూడా హాజరవుతారని వీహెచ్‌‌‌‌పీ(విశ్వహిందూ పరిషత్) అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. అయితే, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆరోగ్యం, వయస్సు  దృష్ట్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు అయోధ్యలో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం లేదని రామజన్మభూమి ట్రస్ట్ గత నెలలో పేర్కొంది.