- మూడు రోజుల కింద ఘటన, పట్టించుకోని ఎస్‌వో స్వప్న
- జిల్లా ఆఫీసర్ల రాకతో హాస్పిటల్‌కు స్టూడెంట్ల తరలింపు
- విద్యార్థులను పరామర్శించిన మంత్రి జూపల్లి, ఎంక్వైరీకి ఆదేశం
కొల్లాపూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కేజీబీవీ ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 30 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో మొత్తం 327 మంది స్టూడెంట్లు ఉన్నారు. మూడు రోజుల కింద అన్నం తిన్న తర్వాత 30 మంది స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ విషయాన్ని స్టూడెంట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో స్టూడెంట్లు అలాగే కేజీబీవీలోనే ఉండిపోయారు.
మూడు రోజులుగా స్టూడెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో కేజీబీవీలో ఉండే ఏఎన్‌ఎం జీసీడీవో శోభారాణికి సమాచారం ఇచ్చింది. దీంతో కేజీబీవీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శిరీష, డీఈవో గోవిందరాజులు, జీసీడీవో శోభారాణి ఆదివారం కేజీబీవీని సందర్శించి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆదివారం రాత్రి 15 మంది స్టూడెంట్లను కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మరో 15 మందికి వాంతులు, విరేచనాలు తగ్గకపోవడం, వారంతా నీరసంగా ఉండడంతో వైద్య సిబ్బందే కేజీబీవీకి వచ్చి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
కాగా అస్వస్థతకు గురైన స్టూడెంట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వంట చేయడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. స్టూడెంట్లు అస్వస్థతకు గురైనా ఎస్‌వో పట్టించుకోకపోవడం పట్ల ఆఫీసర్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌వో చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ హాస్పిటల్‌కు వెళ్లి స్టూడెంట్లను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు.