
గ్యాంగ్టక్ : సిక్కింలో విపరీతంగా మంచు కురవడంతో నాథులా ఏరియాలో సుమారు వంద వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ముందుకు కదిలే వీలులేకుండా పోయింది. ఈ వాహనాల్లో సుమారు 400 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. నాథులా, త్సోంగో సరస్సును సందర్శించి తిరిగొస్తుండగా మంచు కారణంగా వారి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.
దీనిపై సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది (త్రిశక్తి కోర్) స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్ హిమరాత్ చేపట్టారు. రాత్రంతా శ్రమించి టూరిస్టులు అందరినీ సేఫ్ గా తరలించారు. ఆదివారం ఉదయం రోడ్లపై మంచును తొలగించి టూరిస్టుల వాహనాలను తీసుకొచ్చారు.