చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ముమ్మరంగా ఏర్పాట్లు

చేప ప్రసాదం పంపిణీకి  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ముమ్మరంగా ఏర్పాట్లు
  • 6 లక్షల మంది వస్తారని బత్తిన కుటుంబ సభ్యుల అంచనా
  •     నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ముమ్మరంగా ఏర్పాట్లు
  •     వృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు 
  •     ఈ నెల 9 నుంచి 10 వరకు చేప ప్రసాదం పంపిణీ
  •      తర్వాత రెండ్రోజులపాటు దూద్ బౌలిలోని బత్తిన నివాసంలో..

హైదరాబాద్, వెలుగు:నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన కుటుంబ సభ్యులు 178 ఏండ్లుగా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కరోనా కారణంగా మూడేండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. పరిస్థితులు అంతా నార్మల్​అవడంతో ఈసారి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మూడేండ్ల తర్వాత కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఏటా 4 లక్షల మంది వచ్చేవారు. ఈసారి రాష్ట్రంతోపాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి 5 నుంచి 6 లక్షల మంది రావచ్చని బత్తిన కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాటికి చాలా మంది ఎగ్జిబిషన్​గ్రౌండ్​కు చేరుకునే అవకాశం ఉందని, వారికి ఫుడ్, వాటర్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లోపల, బయట అందించేలా ప్లాన్​చేస్తున్నారు. ఇక చేప మందు కోసం మత్స్యశాఖ చేప పిల్లలను సమకూరుస్తోంది. ఇప్పటికే 2 లక్షల చేప పిల్లలు రెడీగా ఉంచినట్లు, అవరమైతే మరిన్ని అందిస్తామని మత్సశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఒక్కోటి కిలో మీటర్ ​మేర..

ఈ నెల 9 ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిర్విరామంగా చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ తర్వాత రెండ్రోజులపాటు దూద్ బౌలిలోని బత్తిన సోదరుల ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్​మెయిన్​గేట్​నుంచి లోపలికి రాగానే కుడి భాగంలో 18 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యూలైన్ లో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. చేప ప్రసాదం తీస్కునే ప్లేసుకు వెళ్లేసరికి క్యూలైన్లు 32 అవుతాయి. తర్వాత గ్రౌండ్​బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

అన్నిశాఖల సమన్వయంతో

జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు, హెల్త్, రెవెన్యూ, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​అధికారులకు ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చేప ప్రసాదం పంపిణీపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్నిశాఖల అధికారులతో సమావేశం కానున్నారు. అంచనాకు మించి జనం వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకోన్నారు.  

ఎంత మంది వచ్చినా సిద్ధంగా ఉన్నం

1845 నుంచి మా కుటుంబ సభ్యులు ఏటా మృగశిర కార్తెకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 1998 వరకు మా ఇంటికి ఏటా 2 లక్షల మంది వచ్చేవాళ్లు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేయడం మొదలుపెట్టాం. కరోనా కారణంగా మూడేండ్లు నిలిపివేశాం. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లపై తమతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఐదారు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఎంతమంది వచ్చినా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.     
– బత్తిన శివశంకర్ గౌడ్