భద్రాద్రిలో ముక్కోటి  ఏకాదశి ఏర్పాట్లు షురూ

భద్రాద్రిలో ముక్కోటి  ఏకాదశి ఏర్పాట్లు షురూ

భద్రాచలం, వెలుగు: 2022  జనవరి 3 నుంచి షురూ అయ్యే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం రూ.59.94 లక్షలతో ఏర్పాట్లు చేస్తోంది. మెయిన్‍ టెంపుల్‍, వైకుంఠద్వారం, అన్నదానం, పర్ణశాల, గోదావరి ఘాట్‍ ఏరియాలో రంగులకు రూ.16.14 లక్షలు, 11 రోజులపాటు రామాలయం, పర్ణశాల, గోదావరి ఘాట్‍ వద్ద లైటింగ్‍కు 
రూ.10.61లక్షలు, 14,578 చదరపు అడుగుల మేర చలువ పందిళ్ల నిర్మాణానికి రూ.3.12 లక్షలు, తాత్కాలిక వసతి, డ్రెస్‍ చేంజింగ్‍ రూమ్స్​46,332 చదరపుఅడుగుల్లో అద్దె ప్రాతిపదికన నిర్మించేందుకు రూ.4.17 లక్షలు, ఎల్‍ఈడీ స్క్రీన్లు, క్లాత్‍ డెకరేషన్, ఆర్చీ గేట్ల నిర్మాణం.. ఇలా పలు పనులకు ఫండ్స్​కేటాయించారు. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. 12వ తేదీన సాయంత్రం గోదావరిలో సీతారామచంద్రస్వామికి హంస వాహనంపై తెప్పోత్సవం ఉంటుంది. 13న తెల్లవారుజామున ఉత్తరద్వారంలో స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. 29న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.


ఉత్సవం లేని సంవత్సరం
ముక్కోటి ఏకాదశి ఉత్సవం లేని సంవత్సరంగా 2021 నిలిచింది. సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తారు. కానీ 2021లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రాకపోవడం విశేషం. 2014 సంవత్సరంలోనూ ఇదే తరహాలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రాలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే ఏడాది రెండుసార్లు ఈ ఉత్సవాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.