అక్టోబర్ 17న సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ

అక్టోబర్ 17న  సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ
  • హాజరు కానున్న సీఎం కేసీఆర్
  • ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ నేతలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేటలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బైపాస్ రోడ్డులోని నాగదేవత గుడి వెనుక భాగంలోని 15 ఎకరాల ప్రైవేటు స్థలంలో సభను నిర్వహిస్తున్నారు.  మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సభా స్థలికి చేరుకుని ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. సభా స్థలికి సమీపంలోనే హెలిప్యాడ్ ను సిద్దం చేశారు.  నియోజకవర్గం నుంచి దాదాపు లక్ష మందిని సభకు తరలించే విధంగా నాయకులు ఏర్పాట్లు చేశారు.  ఇప్పటికే మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించారు. 

20 వేల బైకులతో  యువకుల రాక

ప్రజా ఆశీర్వాద సభకు నియోజకర్గం నుంచి దాదాపు 20 వేల బైకులతో విద్యార్థులు,  యువకులు తరలిరానున్నారు. దివ్యాంగులు సైతం భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. వారికోసం సభా స్థలి వద్ద ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. సభకు భారీ సంఖ్య లో మహిళలు హాజరయ్యే విధంగా గ్రామాల్లో ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేశారు. సభా స్థలిని మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. సిద్దిపేట మట్టి బిడ్డ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడానికి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని 
పిలుపునిచ్చారు.

భారీ పోలీస్​ బందోబస్తు 

ప్రజా ఆశీర్వాద సభకు పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీపీ శ్వేత సభా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడకుండా  పోలీసులు సలహాలు సూచనలు  అందించాలన్నారు.  అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర  పోలీస్ సిబ్బందితో  సభ జరిగే ప్రాంతాన్ని ఆరు  సెక్టార్లుగా  విభజించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

సభకు  జనాలను తీసుకవచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను సిద్దం చేశారు. నాగదేవత టెంపుల్ చౌరస్తా నుంచి, పెద్దమ్మ టెంపుల్ చౌరస్తా నుంచి వచ్చే వాహనదారులు సభాస్థలి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో  వాహనాలు  పార్కింగ్ చేయాలన్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నారు.  

నాగదేవత టెంపుల్ చౌరస్తా  బైపాస్ రోడ్ నుంచి సిరిసిల్ల వెళ్లే వాహనదారులు..  సిద్దిపేట పట్టణం లేదా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా మీదుగా.. పెద్దమ్మ టెంపుల్ చౌరస్తా  బైపాస్ రోడ్డు నుంచి నాగదేవత టెంపుల్ చౌరస్తాకు వచ్చే వాహనదారులు.. ఎల్లమ్మ టెంపుల్ ఎక్స్ రోడ్, వేములవాడ కమాన్ మీదుగా  వాహనాలను మళ్లించనున్నారు.