ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి: డీసీపీ శిల్పవల్లి

ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి: డీసీపీ శిల్పవల్లి

హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. నగరవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించామని, అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం జరగబోతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఖైరతాబాద్ బడా గణపతిని 2025, సెప్టెంబర్ 6వ తేదీ ఉదయాన్నే టస్కర్ ఎక్కిస్తారని, శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు డీసీపీ శిల్పవల్లి. సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.

ఈ సారి ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని.. ఆయన రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు డీసీపీ శిల్పవల్లి. ముఖ్యంగా చార్మినార్, ఎంజే మార్కెట్ ఏరియాలో ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గణేషుడి మండపాల దగ్గర ఆకతాయిలను గుర్తించడానికి ఇప్పటికే షీ టీమ్స్, ఎస్వోటీ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 

వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మిలాద్ ఉన్ నబి ర్యాలీని ముస్లింలు ఈ నెల 14కు వాయిదా వేసుకున్నారన్నారు. ఇతర జిల్లాల పోలీసులు, ప్రత్యేక బలగాలను బందోబస్తుకు వాడుతున్నామని చెప్పారు. పెద్ద విగ్రహాలు నిమజ్జనం అయ్యేవరకు కానిస్టేబుల్ స్థాయి అధికారి ఉంటాడని తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాలను విసిరేయకుండా క్రేన్ల సహాయంతోనే నిమజ్జనం చేయాలని సూచించారు.