కోరుట్ల, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి లో శనివారం ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అభివృద్ధికి అధిక నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 13 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి, 3 కోట్ల 17 లక్షల మందికి సన్నబియం అందిస్తోందని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇటీవల రూ.18.70 కోట్లు మంజూరు చేశామని, వాటితో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జువ్వాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
