అభివృద్ధిని చూసి ఓటు వేయండి : మంత్రి వాకిటి శ్రీహరి

అభివృద్ధిని చూసి ఓటు వేయండి : మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి
  •     కాంగ్రెస్​ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు

మక్తల్, వెలుగు  : మక్తల్ అభివృద్ధి కాంగ్రెస్‌‌‌‌తోనే సాధ్యమని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చూసి ఈ మున్సిపల్​ ఎన్నికల్లో ఓటు వేయండని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 4, 5, 12, 15 వార్డుల్లో అభ్యర్థులు గుంతలి శివ కుమార్, వెంకటేశ్, రహీం పటేల్, కోళ్ల సంధ్యల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పట్టణ సమగ్ర అభివృద్ధికి తమ అభ్యర్థుల విజయం ఎంతో అవసరమని తెలిపారు. ఇప్పటికే మక్తల్ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేశామని, పట్టణంలో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. 

పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. రూ. 17 కోట్లతో 340 ఇందిరమ్మ ఇండ్లు, రూ. 46 కోట్లతో 150 పడకల ఆస్పత్రి, రూ. 210 కోట్లతో మక్తల్, -నారాయణపేట ఫోర్ లేన్ రోడ్డు లాంటి భారీ ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపారు. మినీ స్టేడియం, కొత్త వాటర్ ట్యాంకులు, కొత్త రేషన్ కార్డులు, డయాలసిస్ సెంటర్ లాంటి ఎన్నో సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.