శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు

కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ నిబంధనల మేరకు అటవీమార్గంలో వచ్చే భక్తులకు, రోడ్డు మార్గంలో వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. మార్చి 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా శివరాత్రి వచ్చిందంటే శివ దీక్షా భక్తులతోపాటు సాధారణ భక్తులు కూడా కాలిబాట మార్గంలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. పాదయాత్ర భక్తులు కర్నూలు జిల్లా ఆత్మకూరు దాటిన తర్వాత వెంకటాపురం వద్ద అడవిమార్గంలోకి ప్రవేశించి బైర్లూటి, నాగలూటి, మర్లకుంట, పెచ్చెర్వు, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు.

కాలిబాట మార్గంలో పలు ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల సౌకర్యార్థం అటవీశాఖ సహకారంతో పలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. చేయాల్సిన ఏర్పాట్ల గురించి శ్రీశైల దేవస్థానం ఈవో ఈవో కేఎస్ రామారావు ఆయా విభాగాల అధికారులతో పరిశీలించారు. కైలాసద్వారంతోపాటు.. పెచ్చెర్వు గూడెం వరకు అడవిలోకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. కైలాసద్వారం వద్ద భక్తులు సెద తీరేందుకు చలువ పందిర్లను (పైప్ పెండాల్ప్) తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కైలాసద్వారం నుండి భీముని కొలను వరకు తాత్కాలికంగా పైప్ లైన్ వేసి తాగునీటి సరఫరా కల్పించాలని సూచించారు. కైలాసద్వారం నుండి భీమునికొలను మార్గంలో దారి పొడవునా ఐదారు చోట్ల వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కైలాసద్వారం వద్ద 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును ఏర్పాటు చేసి నిరంతరం మంచినీటి సరరఫరా చేయాలని ఈవో ఆదేశించారు. కైలాసద్వారం వద్ద నిరంతరం 50వేల లీటర్ల నీరు నిల్వ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎత్తైన కొండ ఎక్కి కైలాస ద్వారం  చేరుకునే వారు ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండడంతో జనరేటర్ ఏర్పాటు చేసి నిరంతరం కరెంటు సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. అలాగే కైలాస ద్వారం వద్ద ఉత్సవాలు ఉట్టిపడే విధంగా తాత్కాలిక స్వాగతతోరణం ఏర్పాటు చేయాలన్నారు. భీమునికొలనుతోపాటు పెచ్చెర్వుగూడెం, కైలాసద్వారం వద్ద పాదయాత్ర భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసే నిర్వాహకులకు శ్రీశైల దేవస్థానం తరపున అవసరమైన సహాయ సహకారాలన్నీ అందజేయాలని దేవస్థానం ఈవో రామారావు ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో డీఈఈలు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నీటిసరఫరా సహాయ ఇంజనీర్ రాజేశ్వరరావు, సహాయ స్థపతి జవహర్‌తోపాటు అటవీశాఖ రేంజర్ ఎం.వి.నరసింహులు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

For More News..

ఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు

ఇప్పటికైనా.. ఏపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోండి

విమానం ఇంజిన్‌లో మంటలు.. వీడియో తీసి పోస్ట్ చేసిన ప్రయాణికుడు