దమ్ముంటే అరెస్ట్ చేయండి

దమ్ముంటే అరెస్ట్ చేయండి

షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్​ఆర్టీపీ చీఫ్​ షర్మిల విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సోమవారం షాద్ నగర్ కు చేరుకోగా.. చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘‘నీతిమాలిన మంత్రి మరదలు అంటే తప్పు లేదట.. ఎవడ్రా మరదలు అని ప్రశ్నిస్తే తప్పట. నిరంజన్ రెడ్డికి తల్లికి.. చెల్లికి తేడా తెలీదు అని మాత్రమే అన్నా.. మంత్రికి, వీధి కుక్కకు తేడా ఏంటి? అని ప్రశ్నించా.. మరదలు అని ఏ మహిళను అయినా అంటే చెప్పుతో కొడుతది. నిరంజన్​రెడ్డిపై ఫిర్యాదు చేస్తే.. నాపైనే కేసు ఫైల్​ చేశారు. కేసీఆర్, నీకు సవాల్ విసురుతున్న.. దమ్ముంటే నన్ను అరెస్ట్​ చెయ్. మీ కేసులకు, బెదిరింపులకు భయపడ” అని షర్మిల మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు కొందరు తనపై ఫిర్యాదు చేస్తే.. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించడం బాధాకరమన్నారు. ‘‘నా మీద కేసులు పెడతారట.. నన్ను అసెంబ్లీకి పిలుస్తరట.. అసెంబ్లీ ముందు కూర్చొని పబ్లిక్ గా మాట్లాడుతా.. కాలినడకన వస్తా.. ఏం అడుగుతారో అడగండి. అసెంబ్లీ లోపలికి రావాలా? బయటే ఉండాలా?”అని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు షర్మిల సవాల్​ విసిరారు. 

కేసీఆర్​ ఓ గజదొంగ

సీఎం కేసీఆర్ ఓ గజ దొంగ అని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్​ చేతిలో మోసపోని వర్గం తెలంగాణలో లేదని విమర్శించారు. వైఎస్సార్​ సీఎంగా ఉన్నప్పుడు షాద్ నగర్ కు ఎంతో చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని, ఇందిరా క్రాంతి, గేదెల పథకం ఈ నియోజకవర్గం నుంచి షురూ చేశారన్నారు. షాద్ నగర్ ప్రజలను కేసీఆర్ మాత్రం మోసం చేశారన్నారు. పోలీసులను కేసీఆర్ పనోళ్లుగా మార్చేశారని, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో.. కేసీఆర్​కు ఈ పోలీసులు అలా అంటూ ఫైర్​ అయ్యారు. పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆబ్కారీ మంత్రి అని, మద్యం అమ్మకాలు పెరిగి మహిళలపై దాడులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దక్షిణ భారతదేశంలో మహిళలపై అత్యాచారాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శలు చేశారు.