పోలీసుల‌పై దాడికి య‌త్నంచిన యువ‌కుడు అరెస్ట్

పోలీసుల‌పై దాడికి య‌త్నంచిన యువ‌కుడు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా: లాక్ డౌన్ ను క‌ఠిన‌త‌రం చేసిన పోలీసుల‌కు కొన్నిచోట్ల చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. పోలీసుల‌పై ఇటీవ‌ల బీహార్ గ్యాంగ్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఇక రాజ‌కీయ నాయ‌కుల స‌పోర్ట్ తో పోలీసుల‌పై వీరంగం సృష్టిస్తున్న సంఘ‌ట‌న‌లు కూడా చూస్తూనే ఉన్నాం. దీంతో పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఎద‌ర‌వుతుంది.  తాజాగా పోలీసుల‌పై ఇద్ద‌రు యువ‌కులు రాళ్ల‌తో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రుగ‌గా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 


రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని .. సులేమన్ నగర్ డివిజన్, ఇమాద్ నగర్ బస్తీలో పోలీసుల‌పై ఇద్దరు యువకులు హల్ చ‌ల్ చేశారు. లాక్ డౌన్ రూల్స్ ప్రకారం మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు రోడ్లమీద తీరకుండ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సులేమాన్ నగర్ కాలనీ పరిధిలోని ఇమాద్ నగర్ బస్తి లో పోలీసులు గస్తీ కాస్తూ ఉండగా.. లాక్ డౌన్ నియమ నిబంధనలు  పాటించకుండా కనీసం తలకు హెల్మెట్, మొహానికి మాస్క్ కూడా లేకుండా అటుగా వచ్చిన యువకుడి వాహనాన్ని ఆపారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన యువకుడి అన్న‌ పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళ్లిన‌ యువకుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. గా గ‌ల్లీకి వ‌చ్చీ మ‌మ్మ‌ల్నే ఆపుతారా అంటూ భూతులు తిట్టారట‌. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తుండగా .. ఇలాంటి పోకిరీలు లాక్ డౌన్ రూల్స్ పాటించకుండా.. రోడ్ల పైన తిరగడమే కాకుండా.. పోలీసులపై దాడులకు పాల్పడటం దారుణ‌మ‌న్నారు స్థానికులు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశామ‌ని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు.