
హైదరాబాద్, వెలుగు: హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి వెళుతున్న సర్పంచ్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మితో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లి ఫోన్లను లాగేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని సర్పంచులు అన్నారు. అరెస్టులను సర్పంచులు ఖండించాలని కోరారు. బేషరతుగా తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచుల అరెస్ట్‌పై సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీతో మాట్లాడారని చెప్పారు.