జ్యోతి మల్హోత్రా దేశ ద్రోహినా: పహల్గాం ఎటాక్ ముందు ఆమె రెక్కీ చేసిందా.. పాకిస్తాన్‎కు ప్లాన్ ఇచ్చిందా..?

జ్యోతి మల్హోత్రా దేశ ద్రోహినా: పహల్గాం ఎటాక్ ముందు ఆమె రెక్కీ చేసిందా.. పాకిస్తాన్‎కు ప్లాన్ ఇచ్చిందా..?

న్యూఢిల్లీ: పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ)కి గూఢచారిగా పని చేస్తోందన్న ఆరోపణపలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించగా.. తాజాగా జ్యోతికి సంబంధించి మరో కీలక విషయం బయట పడింది. 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. 

అయితే.. పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి.. ఈ ఉగ్రదాడికి మూడు నెలల ముందే పహల్గాంలో పర్యటించింది. పోలీసులు విచారణలో తాజాగా ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శేష్ పాల్ వైద్ వెల్లడించారు. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‎తో పరిచయమున్న యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా జనవరి 2025లో పహల్గామ్‌ను సందర్శించడం యాదృచ్చికమా..? అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. 

సాధారణంగా మన నిఘా వర్గాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు లేదా ఆ దేశ హైకమిషన్లను తరచుగా సందర్శించే వారిపై నిఘా ఉంచుతాయని ఆయన తెలిపారు. శేష్ పాల్ వైద్ షేర్ చేసిన వీడియోతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో పహల్గాం ఉగ్రదాడికి, జ్యోతికి ఏమైనా లింక్ ఉందా..? పహల్గాం ఎటాక్ ముందు ఆమె రెక్కీ నిర్వహించి పాకిస్తాన్‎కు ప్లాన్ ఇచ్చిందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

అసలు కేసు ఏంటి..?

 కాగా, పాక్ ఐఎస్ఐ ఏజెంట్‎గా పని చేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురుని శనివారం (మే 17) హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. భారత్‎కు చెందిన సున్నితమైన సమాచారంతో పాటు, సైనిక రహస్య సమాచారాన్ని పాక్‎కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. 

కీలక నిందితురాలైన జ్యోతి మల్హోత్రా "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ట్రావెలింగ్‎కు సంబంధించిన వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే 2023లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ట్రావెల్ వీసా మీద జ్యోతి పాకిస్థాన్‎లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తోన్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమెకు పరిచయమైంది.

►ALSO READ | ఆపరేషన్ సిందూర్‎పై వ్యాఖ్యలు.. అశోక వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టు

జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (PIO)లకు డానిష్ పరిచయం చేశాడు. ఇందులో ఓ పీఐవోతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకుని బాలి వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‎లో ఉన్న జ్యోతి.. భారత్‎లోని పలు ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు గుర్తించారు.

ఈ మేరకు జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాల కింద కేసు నమోదు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఆదివారం (మే 18) మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా.. 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.