హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. శుక్రవారం (మార్చి 20) శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
చట్ట ప్రకారం విచారణ పూర్తి కాకుండా నిందితులను అరెస్ట్ చేయలేమన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ రావుకు క్లీన్ చిట్ వచ్చిందని.. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 6 వేల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ని సస్పెండ్ చేశామని తెలిపారు.
