నేడు సమ్మక్క రాక

నేడు సమ్మక్క రాక

సారలమ్మ రాకతో జాతర తొలిఘట్టం పూర్తికాగా.. గురువారం సమ్మక్క తల్లి గద్దెను చేరనుంది.
శుక్రవారం సమ్మక్కసారలమ్మ ఇద్దరూ గద్దెలపై ఉంటారు.
దీంతో ఆ రోజున భక్తులంతా దర్శనానికి పోటెత్తే అవకాశం ఉంది.
శనివారం దేవతలు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు.

మేడారం, జనగామ, వెలుగుకొమ్ముబూరలు, డోలు వాయిద్యాలు మార్మోగంగ..  శివసత్తుల పూనకాలతో అడవితల్లి పరవశించంగ.. ఆడబిడ్డలంతా వరం పట్టంగ.. అమ్మలగన్న అమ్మ సమ్మక్క బిడ్డ సారలమ్మ కన్నెపల్లి నుంచి పసుపు, కుంకుమ రూపంలో మొంటెలో కదిలివచ్చింది. తోడుగా పగిడిద్దరాజు, గోవిందరాజు తరలివచ్చారు. సారలమ్మతోపాటు గద్దెలనెక్కారు. వనమంతా భక్తజన సంద్రమైంది. బుధవారం రాత్రి ఆడబిడ్డ సారలమ్మ రాకతో నాలుగురోజుల మేడారం మహాజాతర షురువైంది. గురువారం చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క కూడా కదిలిరానుంది.

నేడు గద్దెపైకి సమ్మక్క

మేడారం జాతరలో మరో అద్భుత సన్నివేశం సమ్మక్క గద్దెపైకి చేరే ఘట్టం గురువారం జరుగనుంది. సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. భక్తులు ఎదురేగి స్వాగతం పలుకుతుండగా.. సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టిస్తారు. అమ్మలు గద్దెలపైకి చేరుకోవడం పూర్తవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.