
Valencia India IPO: ఇటీవల ఐపీవోలు ఇన్వెస్టర్లను ఊరించి చివరికి ఉత్తిచేతులతో పంపిస్తు్న్నాయి. అవును కొత్త ఏడాదిలో వచ్చిన అనేక ఐపీవోలు భారీగా సబ్ స్క్రిప్షన్లు చూస్తున్నప్పటికీ అవి వాస్తవ లాభాలుగా చాలా తక్కువ ఐపీవోల్లో మాత్రమే జరుగుతున్నట్లు నివేదిక రివీల్ చేసింది. ఈరోజు అలాంటి ఒక ఐపీవో ఇన్వెస్టర్లకు తొలిరోజే భారీ నష్టాలతో షాక్ ఇచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వాలెన్సియా ఇండియా కంపెనీ షేర్ల గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో బీఎస్ఈలో నష్టాల లిస్టింగ్ నమోదు చేసింది. 20 శాతం డిస్కౌంటెడ్ లిస్టింగ్ నమోదు కావటంతో ఒక్కో షేరు రూ.88 రేటుకు అడుగుపెట్టింది. అయితే దీని తర్వాత కూడా ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల డిమాండ్ భారీగా పెరిగిపోవటంతో స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.83.60 వద్ద స్థిరపడింది.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.48.95 కోట్లను సమీకరించింది. ఇందుకోసం ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.95 నుంచి రూ.110గా నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ కూడా కలిగి ఉన్న ఐపీవో బిడ్డింగ్ కోసం లాట్ పరిమాణం 1200 షేర్లుగా ప్రకటించబడింది. దీని కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు కనీసం రూ.లక్ష 32వేలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అయితే లిస్టింగ్ తర్వాత లాట్ కి రూ.26వేల కంటే ఎక్కువ నష్టాన్ని షేర్లు పొందిన ఇన్వెస్టర్లు చూడటం నిరాశకు గురిచేసింది.
కంపెనీ వ్యాపారం..
వాలెన్సియా ఇండియా కంపెనీకి దేశంతో పాటు విదేశాల్లో కార్యకలాపాలను కలిగి ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆహారం, ఆహారేతర ఉత్పత్తుల ఎగుమతి-దిగుమతిలో ఉంది. హాస్పిటాలిటీ రంగంలో కూడా ఉన్న కంపెనీకి కొన్ని ప్రసిద్ధ రిసార్ట్స్ ఉన్నాయి.