
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెను విషాదాల్లో ఒకటిగా నిల్చిన పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందన స్పందించింది. ఈ మేరకు సిగాచి కంపెనీ ప్రతినిధి అమిత్ రాజ్సింహ బుధవారం (జూలై 2) మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి కారణం బాయిలర్ పేలుడు కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 143 మంది కార్మికులు ఉన్నారని.. అందులో 38 మంది మృతిచెందారని తెలిపారు. గాయపడ్డవారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కంపెనీలో పరికరాలు కాలం చెల్లినవి అనడంలో అర్థం లేదని.. కేవలం బిల్డింగ్ మాత్రమే పాతదని.. అందులోని ఎక్విప్మెంట్ మొత్తం కూడా అధునాతనమైనదేనని ఆయన వివరణ ఇచ్చారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
►ALSO READ | బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ
మరోవైపు.. ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిల్చిన పాశమైలారం సిగాచి పేలుడు ఘటనపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి. వెంకటేశ్వర్లు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో 2025, జూన్ 30న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి దాదాపు 40 మంది వరకు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలుడి ధాటికి కంపెనీ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున నష్టం పరిహారం ప్రకటించింది