బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ

బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ

జగిత్యాల: బనకచర్ల ప్రాజెక్ట్‎పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులత్లో అడ్డుకుంటామని.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. బుధవారం (జూలై 2) ఎంపీ వంశీ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‎గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు పాలు చేసిందని విమర్శించారు. 

లక్ష కోట్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఎటూ పనికి రాకుండా పోయిందని దుయ్యబట్టారు.కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకున్నా లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని.. దీనిని చూసి కాలేశ్వరం ప్రాజెక్టు అవసరమో లేదో ప్రజలు గుర్తించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్ల రూపాయలు వృధా తప్ప.. రైతులకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. 

కేసీఆర్ మాదిరిగానే కమిషన్ల కోసం ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరిగే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని.. తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేంటి..? బీజేపీకి తెలంగాణపై ఎందుకు అంత ద్వేషమని ప్రశ్నించారు. 

►ALSO READ | పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి జల వివాదాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాలను లేవనెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి మాత్రమే ఎలా సపోర్ట్ చేస్తారో ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోమని.. రాష్ట్రానికి రావాలసిన నిధులు, హక్కులు కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు.