
హైదరాబాద్: పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ చైర్మన్‌గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్‌లను నియమించింది ప్రభుత్వం.
బి. వెంకటేశ్వర్ నేతృత్వంలోని కమిటీ ప్రమాదానికి గల కారణం ఏంటి..? కంపెనీ అన్ని నిబంధనలు పాటించిందా లేదా అన్న అంశాలపై నిపుణుల కమిటీ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనుంది. ఎక్స్ పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో 2025, జూన్ 30న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి దాదాపు 40 మంది వరకు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలుడి ధాటికి కంపెనీ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | డెడ్‌బాడీలు అప్పగించే వరకు కదిలేదే లేదు.. సిగాచి కంపెనీ ముందు బాధితుల ఆందోళన
ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున నష్టం పరిహారం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చిన సిగాచి కంపెనీ పేలుడు ఘటన ఎన్నో కుటుంబాల్లో పూడ్చలేని విషాదాన్ని మిగిల్చింది.