
ఆస్ట్రేలియాలో ఒక అరుదైన ఘటన మళ్ళీ వెలుగు చూసింది. ఒకప్పుడు ఎంతో ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడు మరోసారి పడగలు విప్పుతుంది. తాజాగా న్యూ సౌత్ వేల్స్ (NSW)లో 50 ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ (ABLV) సోకి మరణించినట్లు NSW హెల్త్ ధృవీకరించింది. అయితే ఈ కేసు రాష్ట్రం ABLV సోకిన మొదటి కేసు. నిజానికి మరణించిన వ్యక్తికి కొన్ని నెలల క్రితం గబ్బిలం కాటు వేసింది. వైరస్ సోకడానికి ముందు అతను కొన్ని వారాల నుండి ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో ABLV వల్ల ఇప్పటికి నలుగురు మృతి చెందడం విశేషం.
NSW హెల్త్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కైరా గ్లాస్గో మాట్లాడుతూ ఈ పరిస్థితి చాలా విషాదకరమైనది అని, గబ్బిలం కాటు వేసిన తర్వాత అతనికి చికిత్స అందిందని, కానీ అతని అనారోగ్యానికి ఇతర కారకాలు ఏమైనా ఉన్నాయా అని కూడా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. గబ్బిలాలను తాకోద్దని, ముఖ్యంగా సరైన టీకాలు ఇంకా శిక్షణ లేకుండా వాటితో ఉండొద్దని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. "ఆస్ట్రేలియాలోని ఏ గబ్బిలం అయినా లైసావైరస్‌తో ఉండవచ్చు కాబట్టి, గబ్బిలాలను తాకోద్దని లేదా వాటికీ దగ్గరగా ఉండొద్దని NSW హెల్త్ ప్రజలకు మరోసారి హెచ్చరిస్తుంది" అని ఒక అధికారి తెలిపారు.
ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ (ABLV) అంటే ఏమిటి:
ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ (ABLV) అనేది ఆస్ట్రేలియన్ గబ్బిలాలలో కనిపించే అరుదైన, ప్రాణాంతకమైన వైరస్. దీనికి రేబిస్ వ్యాధితో దగ్గరి సంబంధం ఉంటుంది. వైరస్ సోకిన గబ్బిలం లాలాజలం ద్వారా సాధారణంగా కాటు లేదా గీకడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.
ఈ వైరస్‌కు చికిత్స లేదు. అందుకే వైరస్ లక్షణాలు సోకకముందే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. వైరస్‌కు గురైన వారికి వెంటనే రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ అండ్ రేబిస్ వ్యాక్సిన్ కోర్సు అవసరం. ఆస్ట్రేలియాలో ఈ కేసుతో కలిపి మొత్తం నాలుగు ABLV కేసులు మాత్రమే బయటపడ్డాయి. గబ్బిలం కరిచిన లేదా గీసిన ఎవరైనా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.