ఇరాన్పై వేసే అతి పెద్ద బాంబ్ అదేనా.. ఈ రాత్రి ఇరాన్లో ఏం జరగబోతుంది.. !

ఇరాన్పై వేసే అతి పెద్ద బాంబ్ అదేనా.. ఈ రాత్రి ఇరాన్లో ఏం జరగబోతుంది.. !

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇవాళ రాత్రికి (శనివారం, మార్చి 7, 2026) పీక్స్కు చేరే అవకాశం కనిపిస్తుంది. దీపావళి టపాసుల మాదిరిగా ఇరాన్లో బాంబుల మోత మోగించేందుకు అమెరికా ఇజ్రాయెల్కు భారీగా మందు గుండు సామాగ్రి సరఫరా చేసింది. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్లో ఇప్పటికే 3వేలకు పైగా టార్గెట్లను అమెరికా ధ్వంసం చేసింది. వారం రోజుల యుద్ధంలో పెను విధ్వంసాన్ని సృష్టించామని అమెరికా చెప్పుకొచ్చింది.

ఈ రాత్రి ఇరాన్‌పై అమెరికా అతి పెద్ద బాంబు దాడికి ప్లాన్ చేసిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించడం గమనార్హం. అమెరికా దాడి ఇరానియన్ మిస్సైల్ లాంచర్‌లకు, క్షిపణులను తయారుచేస్తున్న కర్మాగారాలకు భారీ నష్టం కలిగిస్తుందని బెసెంట్ చెప్పారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై స్పందిస్తూ.. ఇరాన్ ఈ చర్యతో అంతర్జాతీయంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని బెసెంట్ ఆరోపించారు.

ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై విరుచుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ నివాస సముదాయం కింద అత్యంత పటిష్టంగా నిర్మించిన భారీ భూగర్భ బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మొసాద్, ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన ఖచ్చితమైన సమాచారంతో సుమారు 50 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 

అయతొల్లా అలీ ఖమేనీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ బంకర్, యుద్ధ సమయంలో అత్యవసరంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉద్దేశించింది. టెహ్రాన్ నగర వీధుల కింద విస్తరించి ఉన్న ఈ బంకర్‌లో అనేక ప్రవేశ మార్గాలు, అగ్రశ్రేణి అధికారుల సమావేశ గదులు ఉన్నాయి. అయితే, 'ఆపరేషన్ రోరింగ్ లయన్'లో భాగంగా జరిగిన ముందస్తు దాడుల్లోనే ఖమేనీ హతమవడంతో, ఆయన ఈ బంకర్‌ను ఉపయోగించుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత ఈ సముదాయాన్ని ఇరాన్ ప్రభుత్వ ఇతర ఉన్నతాధికారులు వాడుతున్నారు.

అలాగే అమెరికాకు చెందిన బీ-2 స్టెల్త్ బాంబర్లు ఇరాన్ లోపల భూగర్భంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై 2,000 పౌండ్ల బరువున్న బాంబులను జారవిడిచాయి. ఈ దాడులతో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. కాగా, షిరాజ్ నగరంలోని జీబాషహర్ ప్రాంతంలో జరిగిన దాడిలో 20 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. 

లోరెస్తాన్ ప్రావిన్స్​లో జరిగిన ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆరుగురు సామాన్య పౌరులు గాయపడ్డారు. ఇస్ఫాహన్, కోమ్, కెర్మాన్‌షా నగరాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణి స్థావరాలున్న కెర్మాన్‌షా పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లలో అత్యధిక భాగాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది.