IND VS ENG 2025: ఇంగ్లాండ్ బౌలర్ చీప్ ట్రిక్స్.. గిల్ ఏకాగ్రతను దెబ్బ కొట్టేందుకు స్కెచ్

IND VS ENG 2025: ఇంగ్లాండ్ బౌలర్ చీప్ ట్రిక్స్.. గిల్ ఏకాగ్రతను దెబ్బ కొట్టేందుకు స్కెచ్

బర్మింగ్‌‌హామ్‌‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు తడబడిన టీమిండియా గిల్, జడేజా భాగస్వామ్యంతో తొలి రోజు ఇంగ్లాండ్ పై టీమిండియా ఆధిపత్యం చూపించింది. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (216 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్‌‌) సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్‌‌ (87) మెరుగ్గా ఆడటంతో.. తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 85 ఓవర్లలో 310/5 స్కోరు చేసింది. మొదటి రోజు ఆటలో భాగంగా గిల్ సెంచరీ హైలెట్ గా నిలిచింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో బాధ్యతగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గిల్ ను ఔట్ చేయడం ఇంగ్లాండ్ వలన కాలేదు. అయితే తొలి రోజు ఆటలో భాగంగా గిల్ ను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్ కార్స్ చేసిన చీప్ ట్రిక్స్ చర్చనీయాంశంగా మారుతుంది. లంచ్ తర్వాత కార్స్ బౌలింగ్ యాక్షన్ మొదలుపెట్టి బాల్ రిలీజ్ చేసే ముందు ఎడమ చేతిని దూరంగా చాచి చూపించాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన గిల్.. బంతిని ఆడకుండానే తప్పుకున్నాడు. అంపైర్ తో మాట్లాడుతూ కార్స్ చేసిన పనిని వివరించాడు. అంపైర్లు కూడా కార్స్ కు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. 

ఆ తర్వాత కార్స్ వేసిన ఇన్స్ స్వింగ్ బంతిని గిల్ ఆడడంలో విఫలమయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. రివ్యూలో బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తగలడంతో బతికిపోయాడు. ఈ ఇంగ్లీష్ పేసర్ చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ విచారణ జరిపి కార్స్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్లైతే అతనికి ఫైన్ విధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో కార్స్ కరుణ్ నాయర్ వికెట్ తీసుకున్నాడు. మరోవైపు గిల్ (114*) సెంచరీతో తొలి రోజు అజేయంగా నిలిచాడు.