IND vs ENG: సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్ట్‎లో భారీ స్కోర్ దిశగా టీమిండియా

IND vs ENG: సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్ట్‎లో భారీ స్కోర్ దిశగా టీమిండియా

ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా సారథి శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 199 బంతుల్లో 11 ఫోర్లు బాది సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టుల్లో 7వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు గిల్. టెస్ట్ కెప్టెన్‎గా ఇది రెండో సెంచరీ.  ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (87) హాఫ్ సెంచరీ, గిల్ సెంచరీతో రాణించడంతో తొలి రోజే టీమిండియా 300 పరుగుల మార్క్ ధాటి భారీ స్కోర్ దిశగా వెళ్తుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (113), జడేజా (39) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు తీయగా, బెన్ స్టోక్స్, కార్సే, షోయబ్ బషీర్ తలో వికెట్ సాధించారు. మొదట్లో తడబడ్డ టీమిండియా ఇన్సింగ్స్‎ను గిల్, జడేజా ముందుకు తీసుకెళ్తున్నారు. 

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన టీమిండియాకు ఫస్ట్ సెషన్లోనే షాక్ తగిలింది. తొలి సెషన్‎లో రెండు వికెట్లు కోల్పోయిన గిల్ సేన.. రెండో సెషన్‎లో కీలకమైన జైశ్వాల్ వికెట్ పోగొట్టుకుంది. తొలి రోజు టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‎లో మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.  2 వికెట్ల నష్టానికి 98 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా.. ఈ సెషన్ లో మరో 84 పరుగులు రాబట్టింది. 

►ALSO READ | MLC 2025: నీ ఆటకు ఆకాశమే హద్దు: ఫిన్ అలెన్ 302 అడుగుల భారీ సిక్సర్

జైశ్వాల్, గిల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. గిల్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకుంటూ పూర్తి డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని స్టోక్స్ విడగొట్టాడు. 45 ఓవర్ తొలి బంతికి స్టోక్స్ విసిరిన బాల్‎ను కట్ చేయబోయి జైశ్వాల్ వికెట్ కీపర్‎కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 65 పరుగుల భాగస్వామ్యం తర్వాత టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 

87 పరుగుల వద్ద ఔటైన ఈ టీమిండియా యువ ఓపెనర్.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి ఆకట్టుకున్న జైశ్వాల్  రెండో టెస్టులో 100 పరుగుల మార్క్ కోల్పోయి నిరాశగా పెవిలియన్‎కు చేరాడు. అంతకముందు తొలి సెషన్‎లో 26 బంతుల్లో 2 పరుగులు చేసిన రాహుల్ వోక్స్ ఇన్ స్వింగ్‎కు క్లీన్ బౌల్డయ్యాడు.31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కరుణ్ నాయర్.. కార్సే బౌలింగ్‎లో స్లిప్‎లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా నిరాశ పర్చాడు. కేవలం 1 రన్ మాత్రమే చేసి వోక్స్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు.