- 16 బోట్ లను ధ్వంసం చేసిన అమెరికా
వాషింగ్టన్/టెహ్రాన్: ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ 'సీ మైన్లు(సముద్రపు బాంబులు)' ఏర్పాటు చేస్తున్నదన్న వార్తలు ప్రపంచ దేశాల్లో టెన్షన్ రేపుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే 12కు పైగా మైన్లను నీటిలో అమర్చింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే వందలాది బాంబులను పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే, ఇరాన్ సీ మైన్లు ఏర్పాటు చేయడాన్ని గమనించిన అమెరికా సైన్యం మంగళవారమే మెరుపు దాడి చేపట్టింది.
ఈ దాడిలో మైన్లను మోహరించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 16 ఇరాన్ బోట్ లను అమెరికా ధ్వంసం చేసింది. అనంతరం ట్రంప్ స్పందిస్తూ..ఒకవేళ ఇప్పటికే సీ మైన్లను ఏర్పాటు చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని, లేకుంటే ఇరాన్ ఎన్నడూ చూడని సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అసలేమిటీ సీ మైన్లు?
సీ మైన్లు అంటే సముద్ర గర్భంలో లేదా ఉపరితలంపై అమర్చే పేలుడు పదార్థాలు. ఇవి శత్రు దేశాల నౌకలను, సబ్ మెరైన్లను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే మొదటి సీ మైన్‌ను 1776లో అమెరికాకు చెందిన డేవిడ్ బుష్నెల్ అనే విద్యార్థి కనిపెట్టాడు. అతను గన్‌పౌడర్‌తో నింపిన ఒక చెక్క పెట్టెకు ఫ్యూజ్‌ను అమర్చి దీనిని తయారు చేశాడు. అయస్కాంత తరంగాలు, శబ్దం, వాటర్ ప్రెషర్ ద్వారా సముద్రంలో ప్రయాణించేది యుద్ధ నౌకనా లేక సాధారణ ట్యాంకరా అనే విషయాన్ని ఆధునిక మైన్లు గుర్తిస్తున్నాయి.
ఇవి నీటి లోపల పేలగానే ఒక పెద్ద గ్యాస్ బుడగ ఏర్పడి వేగంగా పైకి వస్తుంది. ఆ బుడగ నౌక అడుగు భాగాన్ని బలంగా కొట్టి దాన్ని రెండు ముక్కలు చేస్తుంది. యుద్ధం చేయకుండానే శత్రు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి సీ మైన్లను వాడతారు. హార్మూజ్ వంటి చోట్ల ఒక్క మైన్ పేలినా.. ఇన్సూరెన్స్ కంపెనీలు భయపడి ట్యాంకర్లకు అనుమతి ఇవ్వవు. దీనివల్ల రవాణా నిలిచి చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 80 నుంచి 90 శాతం చిన్న పడవలు, మైన్లను మోహరించే నౌకలు సిద్ధంగా ఉన్నాయని, ఇది చమురు సరఫరాకు పెద్ద ముప్పుగా మారిందని ఎక్స్ పర్ట్స్ పేర్కొన్నారు.
